మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం ప్రారంభం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 5, 2022, 4:30 PM IST
Highlights

మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం ప్రారంభం కానుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చెప్పారు. 

హైదరాబాద్:మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలు కానుందని బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఆయన  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ఫామ్ హౌస్ నుండి రాని కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక దెబ్బతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారన్నారు. మూడో విడత గొర్రెల పంపిణీని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. గ్రామానికి ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగినా మునుగోడు ప్రజలను తమవైపునకు తిప్పుకోలేరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా 100 స్కీమ్ లు పెట్టినా కూడా కేసీఆర్ ను ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు.మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా  లేఖను కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి పంపారు. ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సమర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రాజీనామాను ఆమోదించారు. దీంతో ఆరు మాసాల్లోపుగా  ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. గత నెల 21న మునుగోడులో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగనున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా పట్టుదలతో ఉంది. సిట్టింగ్ స్థానాన్ని ప్రత్యర్ధులకు దక్కకుండా కాపాడుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.  మునుగోడు అసెంబ్లీ స్థానంలోని ఏడు మండలాలకు ఇద్దరు చొప్పున కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను నియమించింది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి  టీఆర్ఎస్ ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. నియోకవర్గంలోని ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తులను టీఆర్ఎస్ లో చేర్చుకొనే ప్రయత్నం  చేస్తున్నారు.
 

click me!