కేంద్ర కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్... తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేఒక్కడు , ఆయన ప్రస్థానం ఇదే

By Siva KodatiFirst Published Jul 7, 2021, 7:33 PM IST
Highlights

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే తెలంగాణకు చెందిన సీనియర్ నేత కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు హోంశాఖ సహాయ మంత్రిగా వున్న కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారన్న దానిపై క్లారిటీ లేదు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే తెలంగాణకు చెందిన సీనియర్ నేత కిషన్ రెడ్డికి ప్రధాని మోడీ ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు హోంశాఖ సహాయ మంత్రిగా వున్న కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా దక్కింది. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారన్న దానిపై క్లారిటీ లేదు. కాకపోతే కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖను కిషన్ రెడ్డికి కట్టబెట్టే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కిషన్ రెడ్డికి ప్రమోషన్ దక్కడంపై తెలంగాణ బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. సాయంత్రం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నేతలు, కార్యకర్తలు నృత్యాలు చేయడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు.

తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టడంతో పాటు అమిత్ షా, మోడీలకు సన్నిహితంగా వుండటంతో కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదగడానికి దోహదపడ్డ అంశాలుగా చెప్పుకోవచ్చు. బీజేపీలో కిషన్ రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1960లో రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి. జయప్రకాశ్ నారాయణ్ స్పూర్తితో జనతా పార్టీలో యువ కార్యకర్తగా చేరారు. 17 ఏళ్ల నూనుగు మీసాల వయసులో 1977వ సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత మూడేళ్లకు 1980లో బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారు.

Also Read:మోడీ మంత్రివర్గ విస్తరణ: కిషన్ రెడ్డి సహా ఆ మంత్రులకు ప్రమోషన్

బీజేపీలో సామాన్య కార్యకర్తగా చేరి.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కిషన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డుల్లోకెక్కారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2009, 2014లో అంబర్ పేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపోందారు. ఆ వెంటనే ఎన్డీయే 2 కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
 

click me!