ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ ఇవాళ సమావేశం అయ్యారు. ఈ నెల 18న ఏర్పాటు చేసే బహిరంగ సభపై చర్చించనున్నారు. అయితే అదే రోజున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమిత్ షాతో భేటీ కానున్నారనే ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో సోమవారం నాడు కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ చర్చించనున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 18న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారనే ప్రచారం సాగుతుంది. అదే రోజున ఖమ్మంలో కేసీఆర్ సభ ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్ల విషయమై చర్చించనున్నారు.
ఈ నెల ఒకటో తేదీ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని ప్రకటించారు.
రానున్న రోజుల్లో రాజకీయ కురుక్షేత్రానికి తాను సిద్దంగా ఉన్నానని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానం నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లోనే కొనసాగారు.
చాలా కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగుతుంది. కానీ ఈ ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. అయితే ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు మాత్రం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ విషయమై చర్చించనున్నట్టుగా చెబుతున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయమై చర్చించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్త మౌతున్నాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత బహిరంగ సభ నిర్వహించలేదు . ఖమ్మంలో నిర్వహించే సభే బీఆర్ఎస్ తొలి సభగా మారనుంది.