కాంగ్రెస్ వార్ రూమ్ కేసు.. ముగిసిన సునీల్ కనుగోలు విచారణ.. పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలన్న పోలీసులు..!

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 2:33 PM IST
Highlights

కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ కేసులో ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు విచారణ ముగిసింది. ఈ రోజు దాదాపు గంటకు పైగా పోలీసులు సునీల్ కనుగోలును ప్రశ్నించారు. 
 

కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ కేసులో ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు విచారణ ముగిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖులను కించపరిచేలా పోస్టింగ్‌లు చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి సునీల్ కనుగోలును సైబర్ క్రైమ్ పోలీసులు గంటకు పైగా విచారించారు. ఆయన స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేసినట్టుగా సమాచారం. అయితే మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని.. పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని పోలీసులు సునీల్ కనుగోలుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, విచారణ అనంతరం సునీల్ కనుగోలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత మల్లు రవికి కూడా  41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక, గత నెలలో మాదాపూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వార్‌ రూమ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇషాన్‌ శర్మ,  తాతినేని శశాంక్‌,  శ్రీప్రతాప్‌‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు అని పేర్కొన్న పోలీసులు ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులు జారీచేసి.. వివరణతో డిసెంబర్ 30న తమ ముందు హాజరుకావాలని సూచించారు.

సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సునీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు  కొట్టివేసింది. అయితే అతనిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరు కావాలని సునీల్‌ కనుగోలుకు సూచించింది. ఈ క్రమంలోనే జనవరి 8న(ఆదివారం) విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే తాను సోమవారం విచారణకు హాజరవుతానని సునీల్ కనుగోలు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే సునీల్ కనుగోలు నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
 

click me!