ఖైరతాబాద్ గణపతి విగ్రహ నమూనా ఇదే.. తొలిసారిగా మట్టితో.. !

By Mahesh KFirst Published Jun 27, 2022, 5:55 PM IST
Highlights

హైదరాబాద్‌లో ఎప్పుడూ ఫేమస్‌గా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడిని విగ్రహ నమూనా విడుదల అయింది. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఈ నమూనా చిత్రాన్ని విడుదల చేసింది. తొలిసారి ఇక్కడ మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
 

హైదరాబాద్: గణేశ్ చతుర్ది ఇంకా నెలల గడువు ఉన్నప్పటికీ భారీ ఎత్తున నిలబెట్టే ఉత్సవ కమిటీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ సారి ఏ సైజులో తమ గణేశుడు ఉండాలి? ఎలా తయారు చేయాలి? ఎలాంటి రూపంతో రూపొందించాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలను దాదాపు ఖరారు చేసేసుకుని పనిలోకి దిగుతున్నారు. గణేష్ ఉత్సవాల్లో నగరంలోని ఖైరతాబాద్ విగ్రహానికి ప్రతి యేటా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఖైరతాబాద్ విగ్రహాన్ని కచ్చితంగా నగరవాసులు దర్శించుకుని వస్తారు. భారీ విగ్రహంతో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ఆకర్షించడంలో విఫలం అవ్వదు. ఈ సారి కూడా వీరు భారీ వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి రూపు రేఖలను వారు విడుదల చేశారు.

ఖైరతాబాద్ గణేష్ 2022 విగ్రహ నమూనాని ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా ఆయన దర్శనం ఇవ్వనున్నారు. 50 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఈ గణపతికి ఎడమ వైపున త్రిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యం స్వామి కూడా దర్శనం ఇవ్వనున్నారు. ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడికి మరో ప్రత్యేకత కూడా తోడవ్వనుంది. తొలిసారిగా ఇక్కడ ఈ భారీ విగ్రహాన్ని మట్టితో నిర్మిస్తున్నారు. నిమజ్జనానికి తరలి వెళ్లేలా ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ నెల 10న కర్రపూజతో విగ్రహ తయారీ పనులు  ప్రారంభం అయ్యాయి.

click me!