బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. వెలుగులోకి కీలక విషయాలు..

Published : Mar 26, 2022, 11:16 AM IST
బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. వెలుగులోకి కీలక విషయాలు..

సారాంశం

సికింద్రాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఫైర్ సెఫ్టీ, క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలు సేకరించాయి. 

సికింద్రాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఫైర్ సెఫ్టీ, క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలు సేకరించాయి. తాజాగా ప్రమాద ఘటనను క్లూస్ టీమ్స్ త్రీడీ స్కానర్‌తో పరిశీలించింది.  షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలే ప్రమాదానికి కారణమని దర్యాప్తు అధికారులు అంచనాకు వచ్చినట్టుగా సమాచారం. స్క్రాప్ గోదాంలో అంటుకున్న మంటల ద్వారా కరెంట్ బోర్డులు, పేలిన సిలిండర్, కరెంట్ ప్యూజ్‌లతో ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు.

ఒక్కో ప్యూజ్‌లో అదనంగా మందమైన వైర్లు ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వైర్లపై నిప్పురవ్వలు పడటంతో ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గోదాంలో 10కి పైగా స్విచ్ బోర్డులు ఉన్నట్టుగా గుర్తించారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలో మంటలు చెలరేగాయని.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇనుపమెట్ల వద్ద ముందుగా ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. గాఢ నిద్ర సమయంలో దట్టమైన పొగ వల్ల కార్మికులు స్పృహ కోల్పోయి ఉంటారని తెలుస్తోంది. ఇనుపమెట్లు ఉండటంతో కిందకు రాలేక 11 మంది సజీవ దహనం అయినట్టుగా అధికారులు భావిస్తున్నారు. గోదాం కింద భాగంతో పాటు పై అంతస్తులో కూడా సిలిండర్ పేలుళ్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని గుర్తించినట్టుగా సమాచారం. 

ఇక, బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి గోడౌన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు మరింత ఉదృతమయ్యాయి. మంటలు వేగంగా టింబర్ డిపో, స్క్రాప్ గోడౌన్ మొత్తాన్ని వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులకు తప్పించుకోడానికి వీలులేకుండా పోయింది. మొత్తం 11మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి మాత్రం బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మృతులంతా బిహార్ చెందిన కార్మికులుగా గుర్తించారు.

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గోడౌన్ యజమానిని అరెస్ట్ చేయడంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినా సీఎం కేసీఆర్.. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?