వారం రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణీస్తున్న హెలికాప్టర్ మొరాయించింది. దీంతో రోడ్డు మార్గంలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి వచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్ నుండి కేసీఆర్ ఆసిఫాబాద్ కు రోడ్డు మార్గంలో బయలుదేరారు.వారం రోజుల వ్యవధిలో రెండోసారి కేసీఆర్ ప్రయాణీస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య నెలకొంది.
ఈ నెల 6వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాలుగు ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొనేందుకు వెళ్లే సమయంలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే హెలికాప్టర్ ను కేసీఆర్ ఫాం హౌజ్ కు మళ్లించారు. మరో హెలికాప్టర్ కోసం ఈసీకి బీఆర్ఎస్ నేతలు అనుమతి తీసుకున్నారు. మరో హెలికాప్టర్ లో కేసీఆర్ పాలమూరు జిల్లాలో జరిగిన నాలుగు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. నారాయణపేట సభలో పాల్గొన్న తర్వాత రోడ్డు మార్గంలో ఆయన హైద్రాబాద్ కు చేరుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ లో ఇవాళ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొనేందుకు ఒంటిగంటకే కేసీఆర్ కాగజ్ నగర్ చేరుకున్నారు. కాగజ్ నగర్ సభ ముగించుకొని ఆసిఫాబాద్ కు కేసీఆర్ చేరుకోవాలి. కాగజ్ నగర్ సభ ముగిసిన తర్వాత ఆసిఫాబాద్ సభకు వెళ్లేందుకు కేసీఆర్ హెలికాప్టర్ లో కూర్చున్నారు. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. దీంతో రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్ కు బయలు దేరారు. ఆసిఫాబాద్ నుండి బెల్లంపల్లి సభలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది.
also read:మా పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు: సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
హెలికాప్టర్ లో 10 నిమిషాలు కూర్చున్న తర్వాత హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు.హెలికాప్టర్ రెక్కలు కూడ తిరగడం నిలిచిపోయింది. దీంతో కేసీఆర్ సహా హెలికాప్టర్ లో ఉన్న వారంతా బస్సులో ఆసిఫాబాద్ కు బయలుదేరారు. కేసీఆర్ బృందం బస్సులో ఆసిఫాబాద్ లో బయలుదేరిన కొద్దిసేపటికి హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆసిఫాబాద్ నుండి ఇదే హెలికాప్టర్ లో కేసీఆర్ వస్తారా... మరో హెలికాప్టర్ ను రప్పిస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.