రాజ్యసభకు ఇద్దరు ఖరారు: దేశపతి శ్రీనివాస్ కు కేసీఆర్ బంపర్ ఆఫర్

By telugu teamFirst Published Mar 11, 2020, 8:05 AM IST
Highlights

రెండు రాజ్యసభ స్థానాలకు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన వెంట ఉన్న దేశపతి శ్రీనివాస్ ను మండలికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: రాజ్యసభకు ఇద్దరు నేతల పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావుకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో రాజ్యసభ స్థానానికి మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరను ఖరారు చేసినట్లు సమాచారం.

రాజ్యసభ సీట్లను పలువురు మాజీ ఎంపీలు, నాయకులు ఆశించారు. మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం వంటి నేతలు రాజ్యసభకు వెళ్లాలని ఆశించారు. వారితో పాటు దామోదర రావు, గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథి పేర్లను కూడా కేసీఆర్ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. 

వివిధ సమీకరణాల నేపథ్యంలో కేశవరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ వీరిరువురికీ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఇక లాంఛనంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు.

మరోవైపు రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న రెండు శాసన మండలి స్థానాలకు సైతం పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్‌ను, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలం నుంచి దేశపతి శ్రీనివాస్ కేసీఆర్ వెంట ఉంటున్నారు. ఆయన సిద్ధిపేట లోకసభ స్థానాన్ని ఆశించినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దేశపతి శ్రీనివాస్ ను శాసన మండలికి పంపించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.

కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన సురేష్ రెడ్డికి కేసీఆర్ తగిన స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు.

click me!