అదృశ్యమైన లేబర్ ఆఫీసర్ దారుణహత్య..?

By Siva KodatiFirst Published Mar 10, 2020, 5:55 PM IST
Highlights

ఖమ్మంలో అదృశ్యమైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యకు గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత ఆయన ఆచూకీ కోసం నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

ఖమ్మంలో అదృశ్యమైన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యకు గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత ఆయన ఆచూకీ కోసం నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

దీనిలో భాగంగా మొబైల్ సిగ్నల్ ద్వారా ఆనంద్ రెడ్డిని గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సెల్ సిగ్నల్స్ భూపాల్‌పల్లికి సమీపంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో చివరిగా ఆగిపోయాయి.

దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆనంద్ రెడ్డిని బయటకు తీసుకెళ్లిన అతని స్నేహితుడు ప్రదీప్ రెడ్డే ఆయనను ఏమైనా చేసి వుండొచ్చనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

ఖమ్మంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మోపు ఆనంద్ రెడ్డి అనే అధికారి గత నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ఈ నెల 7న ఆయన తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి మళ్లి ఇంటికి తిరిగి రాలేదు.

తొలుత ఏదైనా పనిమీద ఆనంద్ రెడ్డి బయటకు వెళ్లి వుంటారని భావించినప్పటికీ నాలుగు రోజులు అవుతున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా వుండగా ఆనంద్ రెడ్డి స్నేహితుడు ప్రదీప్ రెడ్డి సైతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే స్థానికంగా మాత్రం ఆయనను కమలాపూర్‌కు చెందిన ఇసుక వ్యాపారులు కిడ్నాప్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

click me!