తెలంగాణలో చంద్రబాబు సర్వేలు: కేసిఆర్ సీరియస్

By pratap reddyFirst Published Sep 20, 2018, 10:03 AM IST
Highlights

తన పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపైనే కాకుండా మహా కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై కూడా సర్వేలు చేయించేందుకు చంద్రబాబు ఎపి నిఘా, పోలీసు విభాగాల సిబ్బందిని దించినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్వేలకు పూనుకోవడంపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. సర్వేలకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం, పోలీసు సిబ్బందిని తెలంగాణలో దించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు వ్యవహారంపై కేసిఆర్ గవర్నరన్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలనే యోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తన పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపైనే కాకుండా మహా కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై కూడా సర్వేలు చేయించేందుకు చంద్రబాబు ఎపి నిఘా, పోలీసు విభాగాల సిబ్బందిని దించినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తోంది.

ఎపి పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని కేసిఆర్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేసిాఆర్ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ మొత్తం పాలనాయంత్రాంగాన్ని అమరావతికి తరలించిన తర్వాత పోలీసులు, ఇంటిలిజెన్స్ సిబ్బందిని తెలంగాణలో దించడం సరైంది కాదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ అధికారులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సర్వేలు చేస్తున్నారని ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టీఆర్ఎస్ నాయకులు కేసిఆర్ దృష్టికి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ అసమ్మతి నేతలను లాక్కునేందుకు కూడా ఇంటిలిజెన్స్ వర్గాలను చంద్రబాబు వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

click me!