
హైదరాబాద్: నగర శివారు ప్రాంతం కోకాపేటలో బీఆర్ఎస్ నిర్మించ తలపెట్టిన ‘‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్’’ భవనానికి సీఎం కేసీఆర్ ఈరోజు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక, కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించిన సంగతి తెలిసిందే.
రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా దీనిని రూపొందించనున్నారు. మొత్తం 15 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఈ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. భారత్ భవన్ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.