మోడీపై ప్రత్యక్ష పోరుకు కేసీఆర్ రెడీ: మేయర్ పీఠానికి దూరం

By telugu teamFirst Published Dec 7, 2020, 8:06 AM IST
Highlights

రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ బిజెపిని ఢీకొట్టేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. తన ఆలోచనలో ఉన్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా తమ పార్టీని దెబ్బ తీసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అనుకుంటున్నారు. బిజెపితో ప్రత్యక్ష పోరుకు ఆయన సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకు ముందే ప్రకటించినట్లు ఆయన ఫెడరల్ ఫ్రంట్ కు ఊపిరులు ఊదుతారాని అంటున్నారు. 

రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ బిజెపిని ఎదుర్కునేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే 8వ తేదీన రైతుల తలపెట్టిన భారత్ బంద్ కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. బంద్ లో పాల్గొనాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఇప్పటికే కేసీఆర్ జాతీయ స్థాయిలో కొంత మంది నాయకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం జరిగే సభలో పాల్గొనాలని కోరారని జెడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి చేతిలో దెబ్బ తిన్న నేపథ్యంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతున్నారు. 

తన తాజా వ్యూహంలో భాగంగా ఎంఐఐకు దూరం జరిగినట్లు సంకేతాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఎంఐఎం మద్దతు కోరరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేరే పార్టీ మద్దతు తమకు వద్దని, మేయర్ పీఠానికి దూరంగా ఉందామని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పోరేటర్లతో ఆదివారం జరిగిన సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. 

మజ్లీస్ మద్దతు తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కట్టారని బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ స్థితిలో మజ్లీస్ మద్దతు తీసుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే బిజెపి తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో తాము చెప్పిందే నిజమని రుజువైందని బిజెపి నేతలు చెప్పి ప్రజలను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంది. దీంతో ఎంఐఎంకు వ్యూహాత్మకంగా దూరం జరగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

ఈ స్థితిలో నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక తర్వాతనే మేయర్ పీఠంపై ఆలోచన చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని మజ్లీస్ సహకారంతో తీసుకుంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నష్టం జరిగే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మేయర్ ఎన్నికలను వ్యహాత్మకంగా వాయిదా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. 

నిజానికి, కేసీఆర్ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు గతంలో మద్దతు తెలిపారు నోట్ల రద్దు, జిఎస్టీ వంటివాటికి ఆయన మద్దతు ఇచ్చారు. కరోనా కాలంలో ప్రధాని మోడీ ఇచ్చిన పిలువు మేరకు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి చప్పట్లు కూడా కొట్టారు. బిజెపితో కలిసి కేసీఆర్ పనిచేస్తున్నారని కాంగ్రెసు విమర్శిస్తూ వస్తోంది. 

ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. బిజెపి బలపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టడమే మంచిదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన వ్యవసాయ చట్టాలను, నూతన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించారు. 

click me!