మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని దసరా రోజున కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతుంది.
హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని టీఆర్ఎస్ దసరా రోజున ప్రకటించనుంది. దసరా రోజున సమావేశం నిర్వహిస్తున్నందున అదే రోజున పార్టీ నేతలతో చర్చించి అభ్యర్ధిని ప్రకటించనున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఎల్లుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పార్టీలోని ఆయన వైరి వర్గం వ్యతిరేకిస్తుంది. అయితే గతంలోనే అసమ్మతివాదులను సీఎం వద్దకు తీసుకెళ్లారు మంత్రి జగదీష్ రెడ్డి. అయితే అభ్యర్ధి ఎవరైనా గెలుపించేందుకు అందరూ కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశం ముగిసిన రెండు రోజులకే అసమ్మతివాదులు సమావేశం నిర్వహించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీటిస్తే సహకరించబోమని చెప్పారు. ఈ విషయమై అసమ్మతి నేతలతో టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం చర్చలు జరుపుతుంది.
undefined
దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను టీఆర్ఎస్ నాయకత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. మరో వైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నేతలకు ఇప్పటికే బాధ్యతలను అప్పగించింది. ప్రతి రెండు గ్రామాలకు ఒక ఇంచార్జీని నియమించింది టీఆర్ఎస్ నాయకత్వం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు వంటి నేతలు కూడా యూనిట్ ఇంచార్జీలుగా నియమించారు.
ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన మునుగోడులో కేసీఆర్ సభ నిర్వహించారు. మరోసారి కేసీఆర్ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తుంది టీఆర్ఎస్ నాయకత్వం.
మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఈ స్థానంలో వామపక్ష పార్టీలకు మంచి ఓటు బ్యాంక్ ఉంది. దీంతో సీపీఐ, సీపీఎంల మద్దతును కోరింది టీఆర్ఎస్ నాయకత్వం.ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. ఈ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆరు దఫాలు కాంగ్రెస్, ఐదు దఫాలు సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ విజయం దక్కించుకుంది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇవాళ విడుదలైంది. నవంబర్ 3వతేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ అనివార్యమైంది.
also read:ఇది కాంగ్రెస్ అడ్డా, హుజూరాబాద్, దుబ్బాక ఫలితాలు రిపీట్ కావు: పాల్వాయి స్రవంతి
ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.