ఎమ్మెల్సీగా తనయ కల్వకుంట్ల కవిత: కేసీఆర్ వ్యూహం ఇదీ....

By telugu teamFirst Published Mar 18, 2020, 8:38 AM IST
Highlights

కూతురు కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ కు పక్కా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వ్యూహంలో భాగంగానే ఇది జరిగిందని అంటున్నారు.

హైదరాబాద్: తన కూతురు కల్వకుంట్ల కవితను శాసన మండలికి ఎంపిక చేసుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పక్కా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా కేసీఆర్ కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నిజమాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై పట్టు కోల్పోకూడదనే వ్యూహం అందులో ఉంది. అయితే, అంతకన్నా మించిన వ్యూహం ఉందని అంటున్నారు. 

కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ముందు కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని, మరికొంత మంది ముఖ్య నాయకులను పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. కవిత అభ్యర్థిత్వానికి వారు సానుకూలత వ్యక్తం చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 

కవితను రాజ్యసభకు పంపిస్తారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే, నిజమాబాద్ జిల్లాకు చెందిన కేఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డిని పక్కన పెట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడే కవిత విషయం నిర్ణయమైనట్లు చెబుతున్నారు. కేశవరావుతో పాటు సురేష్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిస్తే ఆ పదవీ కాలం 2022 జనవరి 4వ తేదీ వరకే ఆ పదవిలో ఉంటారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన భూపతి రెడ్డి కాంగ్రెసులో చేరారు. దాంతో ఆయనపై అనర్హత వేటు పడింది. మధ్యలోనే ఖాళీ అయిన ఆ ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం ఐదేళ్ల పాటు ఉండే అవకాశం లేదు. 

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో కవిత విజయం సులభంగానే సాధ్యమవుతుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 824 ఓట్లు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్ ఓట్లు 592. కాంగ్రెస్ ఓట్లు 142 కాగా, బిజెపి ఓట్లు 90 ఉన్నాయి. దాంతో కాంగ్రెసు, బిజెపి ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎన్నిక తప్పకపోతే ఏప్రిల్ 7వ తేదీన పోలింగు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 9న జరుగుతుంది.

ఎమ్మెల్సీగా కవిత విజయంం సాధించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వ్యూహంలో భాగంగానే కవితను ఎమ్మెల్సీగా ఎంపిక చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కవితను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. 

భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలున్న నేపథ్యంలో కవిత మంత్రివర్గంలోకి వస్తారని చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. కేటీఆర్ నిర్వహించిన శాఖలను ఆమెకు అప్పగిస్తారని తెలుస్తోంది. 2022 జనవరి 4వ తేదీన పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి అదే స్థానం నుంచి కవిత పోటీ చేస్తారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల నాటికి కవిత మంత్రి కావడం ఖాయమని అంటున్నారు. 

click me!