టిఆర్ఎస్ తెరపైకి మెరుపులా దూసుకొచ్చిండు

First Published Oct 12, 2017, 3:52 PM IST
Highlights
  • టిఆర్ఎస్ లో ఇంతటి స్థానానికి ఎలా వచ్చాడు?
  • ఆయనకున్న బలమేంటి?
  • పార్టీలో ఆయన భవిష్యత్తు ఏమిటి?

తెలంగాణ రాజకీయాల్లో మరో యువనేత రంగం ప్రవేశం చేసిండు. చడీచప్పుడు కాకుండా హటాత్తుగా రాజకీయ తెరమీదకు దూసుకొచ్చిండు. ఇంతకాలం తెరవెనుక మంత్రాంగం నడిపిన ఆయన ఇకపై తెర ముందు రాజకీయ వ్యవహారాలు నడిపనున్నారు. ఇప్పటికే మీకర్థమైపోయింది కదా? ఆ యువనేత ఎవరో..? ఆయనే టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన జోగినిపల్లి సంతోష్ కుమార్ అలియాస్ సంతూ అలియాస్ సంతోష్ రావు. ఆయన రాజకీయ తెరమీదకు రెండుమూడు రోజుల కిందటే వచ్చినా... రాజకీయంగా తెర వెనుక 16 ఏళ్ల కష్టం ఉంది. అందుకే ఆయనకు పార్టీలో అత్యంత కీలకమైన పదవి దక్కిందని టిఆర్ఎస్ నేతలు చెబుతుంటారు.

సంతోష్ కుమార్ కేసిఆర్ కుటుంబ వారసుల జాబితాలో నాలుగో సంఖ్యగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసిఆర్ కుటుంబంలో కొడుకు కేటిఆర్ మంత్రిగా ఉన్నారు. కూతురు కవిత ఎంపిగా కొనసాగుతున్నారు. మేనల్లుడు హరీష్ రావు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కేసిఆర్ వారసుల జాబితాలో వచ్చి చేరారు. కేసిఆర్ సతీమణి సోదరి కుమారుడే సంతోష్. అంటే కేసిఆర్ మరదలి కుమారుడు అన్నమాట.

టిఆర్ఎస్ పార్టీలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుది? ఎవరి తర్వాత ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లు కేసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ అని చెబుతుంటారు. అయితే ఇప్పుడు సంతోష్ పార్టీ తెరమీదకు వచ్చారు. మరి ఆయనకు ఐదో స్థానం దక్కుతందా అంటే పార్టీ నేతలు ఒప్పుకోరు. పెద్ద సార్ తర్వాత స్థానం సంతన్నదే అని పార్టీలో ఎవరినడిగినా చెప్పే మాట ఇదే. సంతోష్ పార్టీ కేడర్ లో కానీ, పార్టీ అధినేత మనసు గెలుచుకోవడంలో కానీ సక్సెస్ అయ్యారన్నదానికి వారి మాటలే నిదర్శనం.

16 ఏళ్లపాటు కేసిఆర్ అడుగు జాడల్లో నడిచాడు సంతోష్. ఒక్కమాటలో చెప్పాలంటే కేసిఆర్ కు అత్యంత అంతరంగీకుడు సంతోష్ అని చెబుతారు. తెర వెనుక కేసిఆర్ కు అన్నీ సంతోషే అని చెబుతారు. కేసిఆర్ కు బంధువైనప్పటికీ, పార్టీలో ఆయనకు అందరూ సలాములు కొడుతున్నప్పటికీ సంతోష్ ఏనాడూ పార్టీకి చిన్నతనం వచ్చేలా వ్యవహరించలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా అన్నా అంటూ ఆప్యాయంగా సౌమ్యంగా పిలిచే వ్యక్తిగా సంతోష్ పార్టీ నేతలందరిలోనూ తలలో నాలికలా మారిండు.

టిఆర్ఎస్ పార్టీలో అధినేత కేసిఆర్ అపాయింట్ మెంట్ దొరకడం అంత ఈజీ కాదు. హేమాహేమీలకే ఒక్కోసారి అపాయింట్ మెంట్ దొరకదు. ఆ సమయంలో పార్టీ నేతలంతా కేసిఆర్ కు సమాచారం చేరవేయాలన్నా.. కేసిఆర్ నుంచి కబురు అందుకోవాలన్నా సంతోష్ ముందే క్యూ కట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. సంతోష్ కు చెబితే పనైపోతుందని బరువు తీర్చుకుని సంబరపడే నేతలు చాలామందే ఉన్నారు. పార్టీ నేతల్లో కూడా సంతోష్ చెప్పిండంటే అది సార్ చెప్పిన మాటే అన్నట్లు రిసీవ్ చేసుకుంటారు నాయకులందరూ.

టిఆర్ఎస్ ఏర్పాటుకు ముందునుంచే సంతోష్ కేసిఆర్ దగ్గర పనిచేస్తున్నారు. గత 16 ఏళ్లుగా కేసిఆర్ అడుగులో అడుగేస్తూ ప్రతి జయంలోనూ, అపజయంలోనూ భాగస్వామిగా ఉన్నారు సంతోష్. ఆయనెప్పుడూ పదవుల కోసమో హోదాల కోసమో పనిచేసినట్లు కనిపించిన దాఖలాలు లేవని, ఎంతసేపూ పార్టీ అధినేతకు నమ్మకంగా పనిచేయడమే తెలుసని చెబుతంటారు. తొలినాళ్లలో సంతోష్ కేసిఆర్ పిఎగా పనిచేశారు. కేసిఆర్ మనసు తెలిసిన వ్యక్తిగా ఇటు కేసిఆర్ అటు పార్టీ యంత్రాంగం మన్ననలు అందుకున్నాడు. అందుకే సంతోష్ కు టి న్యూస్ ఈడి బాధ్యతలు అప్పగించారు కేసిఆర్. 2012లో టిన్యూస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు సంతోష్ కుమార్.

అయినప్పటికీ ఆయన ఎక్కడా తెర మీద కనిపించలేదు. అయితే తెర వెనుక నుంచి తెరమీదకు రావాలన్న అధినేత ఆలోచన మేరకు గత ఏడాది కాలంగా సంతోష్ కుమార్ తెరమీద ప్రత్యక్షమవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అడుగడుగునా ఆయన టిన్యూస్ లో దర్శనమిచ్చారు. ఆయన ముందుండి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే పని భుజానికెత్తుకున్నారు. దాంతోపాటు కేటిఆర్ బర్త్ డే సందర్భంగా అనాధ ఆశ్రమానికి విరాళాలు ఇచ్చి టివిల్లో, పేపర్లలో కి ఎక్కారు. ఇటీవల కాలంలో వేములవాడ దేవాలయానికి వెళ్లి మీడియా ముందు హల్ చల్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తే రానున్న రోజుల్లో సంతోష్ చట్టసభలకు ప్రాతినిథ్యం వహించడం కూడా జరిగే పరిణామమే అని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

మొద‌టి నుండి కేసీఆర్‌కు న‌మ్మిన బంటుగా ఉంటూ పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో త‌ల‌లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంతోష్‌కుమార్‌, ఇక‌పై నేరుగా పార్టీ వేధిక‌ల‌ను పంచుకోనున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ లేదా ఎంపీగా సంతోష్‌ను నియ‌మిస్తార‌నే ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యాయి. ఓ ద‌శ‌లో న‌మ‌స్తే తెలంగాణా ఎండీ దామోద‌ర్‌రావు లేదా టీ న్యూస్ ఎండీ సంతోష్‌కుమార్‌ల‌కు రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌నుంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే అనూహ్యంగా అప్పుడు కెప్టెన్ ల‌క్ష్మికాంత‌రావు తెర‌మీద‌కు రావ‌డంతో వీరికి రాలేదు. ఆ త‌ర్వాత వేములవాడ  ఎమ్మెల్యే ర‌మేష్‌బాబుపై అన‌ర్హ‌త వేటు ఖాయ‌మ‌ని... వేముల వాడ‌కు ఉప ఎన్నిక రావ‌చ్చ‌నే చ‌ర్చ‌ జ‌రిగిన‌ప్పుడు సైతం సంతోష్ కుమార్ పేరు సోష‌ల్ మీడియాకి ఎక్కింది. చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గంలోని కొదురుపాక గ్రామానికి చెందిన వాడు కావ‌డంతో...పక్క‌నే ఉన్న వేముల‌వాడ నుండి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం పార్టీలోనే పెద్ద ఎత్తున జ‌రిగింది. అయితే అన‌ర్హ‌త విష‌యంలో ర‌మేష్‌బాబుకు హైకోర్డులో ఊర‌ట ల‌భించ‌డంతో ఆ చ‌ర్చ స‌ద్దుమ‌ణిగింది.

సంతోష్ పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. చొప్పదండి నియోజకవర్గంలోని కుదురుపాక గ్రామంలో 1976 డిసెంబరు 7వ తేదీన జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబమే. సంతోష్ కు ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం అంతా కరీంనగర్ జిల్లాలోనే సాగింది. ఇంటర్, డిగ్రీ మాత్రం హైదరాబాద్ లో చదివారు. తర్వాత పూనే యూనివర్శిటీలో ఎంబిఎ పట్టభద్రులయ్యారు. చదువు అయిపోయిన తర్వాత సంతోష్ నేరుగా పెద్దనాన్న అయిన కేసిఆర్ తోనే పనిచేశారు. తొలుత పిఎ గా, తర్వాత టిన్యూస్ ఈడి గా తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మనస్తత్వమే సంతోష్ లో అడుగడుగునా కనిపిస్తదని పార్టీ నేతలు చెబుతారు. కిసఆర్ నిరహార దీక్ష సమయంలో సంతోష్ అనుక్షణం హాస్పటల్ లోనే ఉన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన అనంతరం దీక్ష విరమించారు కేసిఆర్. ఆ సమయంలో సంతోష్ దగ్గరుండి ఆసుపత్రి నుంచి వీల్ చైర్ లో కేసిఆర్ ను ఇంటికి తీసుకెళ్లేందుకు బయటకు తీసుకొస్తారు. ఆ క్షణాలు ఎప్పటికీ తాను మరచిపోలేని అనుభూతులు అని పలు సందర్భాల్లో సంతోష్ తన మిత్రుల వద్ద చెబుతుంటారు.

తెలంగాణ కోసమే కేసిఆర్ అనుక్షణం పనిచేస్తే... తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి సంతోష్ కేసిఆర్ కోసమే పనిచేశారు. ఉదయం తెల్లారుగట్ల నుంచి అర్థరాత్రి వరకు బాస్ తోనే సంతోష్ ఉంటారని నేతలు చెబుతుంటారు. రాత్రి లేదు, పగలు లేదు. పండుగ లేదు పబ్బం లేదూ నిత్యం కేసిఆర్ తోనే నడిచారు సంతోష్. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సంతోష్ ఏనాడూ ప్రభుత్వ వేదికల మీద ఒక్కసారి కూడా కనిపించిన దాఖలాలు లేవు. కేసిఆర్ తో ఆయనకు అంత బంధం ఉన్నప్పటికీ సచివాలయానికి కూడా పెద్దగా రాలేదు. అయితే ఇప్పుడు రాజకీయ హోదా దక్కింది కాబట్టి ఇకమీదట సంతోష్ తెరమీద కనిపించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే 2019లో సంతోష్ కుమార్ MBA చట్టసభల్లో కాలు పెట్టడం ఖాయంగా చెబుతున్నాయి గులాబీ శ్రేణులు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/dKBKp6

 

click me!