దేశానికి కేసీఆర్ ఆదర్శం: వలస కార్మికుల ప్రయాణ ఖర్చు ప్రభుత్వానిదే!

By Sree sFirst Published May 5, 2020, 3:18 AM IST
Highlights

 అయోమయ స్థితిలో ఉన్న వలసకూలీలకు అభయమిచ్చారు కేసీఆర్. వలస కూలీలకు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ ప్రయాణ ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాడు. 

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఎందరో ప్రజలు ఎక్కడెక్కడో చిక్కుబడిపోయారు. వారంతా నెల రోజులకుపైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుబడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 

వీరి పరిస్థితి అర్థం చేసుకున్న కేంద్రం వలస కార్మికులను, చిక్కుబడిపోయిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి తొలి ప్రత్యేక శ్రామిక్ రైలు ఝార్ఖండ్ కి బయల్దేరింది కూడా!

ఇక ఈ రైళ్లలో టికెట్ చార్జీలను ప్రయాణీకుల నుంచి వసూలు చేయవలసిందిగా కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు. ఉపాధి కోల్పోయి దాదాపుగా నెల రోజులు దాటిపోయింది. ఇప్పుడు వారి దగ్గరి నుండి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. 

సోనియా గాంధీ అయితే ఏకంగా వలస కూలీలా టికెట్ చార్జీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని అన్నారు. ఇలా వలస కూలీలు తమ పరిస్థితి ఏమిటి అని అయోమయంలో ఉన్న వేళా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్దమనసుని చాటుకున్నారు. 

రేపటి నుండి వారంరోజులపాటు తెలంగాణ నుంచి 40 ప్రత్యేక రైళ్లు రోజూ బీహార్, ఒడిశా, ఝార్ఖండ్, యూపీ ఇలా వలస కూలీలా సొంత రాష్ట్రలకు పయనమవుతాయని తెలిపారు. అంతే కాకుండా ఆ టిక్కెట్ల పూర్తి చార్జీను కూడా తెలంగాణ సర్కారే భరిస్తుందని, వారంతా ఉచితంగా ప్రయాణించొచ్చని అభయమిచ్చారు. 

గతంలో వలసకూలీలు ఆహరం దొరక్క తమ సొంత ఊర్లకు పోతాము అని ఇబ్బందులు పడుతున్న వేళ, తెలంగాణాలో పనిచేస్తున్న వలస కూలీలంతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా పరిగణింపబడతారని అన్నారు. 

ఇప్పుడు మరోమారు కేసీఆర్ తన పెద్దమనసును చాటుకోవడమే కాకుండా... అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. చేతిలో డబ్బుల్లేక, ఇంటికి ఎలా వెళ్ళాలి అని బాధపడుతున్న వారికి అన్నం పెట్టి అక్కున చేర్చుకోవడమే కాకుండా, వారికి టిక్కెట్లు కొనిచ్చి మరి వెనక్కి పంపిస్తున్నారు కేసీఆర్!

ఇకపోతే... తెలంగాణలో కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొత్తగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,085కి చేరింది.

సోమవారం నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 40 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 585కి చేరింది. వైరస్ కారణంగా మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోగా.. 471 మంది చికిత్స పొందుతున్నారు.

click me!