
కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి పూర్తిగా మోసపోయారని అన్నారు. తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించుకున్నదని, ఇవాళ రాష్ట్రానికి ఏం బీమారి వచ్చింది అర్థం కాలేదన్నారు. ఢిల్లీ నుంచి నకిలీ గాంధీలు వచ్చి చెప్పిన మాటలు, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పారు, హామీలు ఇచ్చారన్నారు.
కేసీఆర్ సర్కార్ రూ.2వేలు పింఛను ఇస్తే.. కాంగ్రెస్‌వాళ్లు 4వేలు ఇస్తామన్నారు. మేము రైతుబంధు రూ.10వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని అన్నారు. రుణమాఫీ రూ.2 లక్షల వరకు ఒక్క సంతకంతో రద్దు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష నగదు, తులం బంగారం ఇస్తామన్నారు. విద్యార్థినులకు స్కూటీలు అన్నారు. ఇలా వారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా వంద శాతం నెరవేర్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు. నేటికీ పింఛన్లు పెరగలేదు, రుణమాఫీ ఎక్కడ జరగలేదు. స్కూటీలు లేవు, ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి.. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని అన్నారు. ఏదైమైనా అంటే.. ప్రతిదానికి కేసీఆర్ కారణమని అంటారు. రాష్ట్రం దివాలా తీస్తుందని అప్పు ఎవడూ ఇవ్వట్లేదని అంటున్నారు. ఇక చెప్పిన హామీల గురించి అడిగితే.. ఆ పండక్కి ఇస్తాం, ఆనెలలో ఇస్తామని గడువు పెంచుతున్నారు. నా కళ్లముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, మోటార్లు కాలిపోయే రోజులు మళ్లీ వచ్చాయన్నారు.
కేసీఆర్ 24 గంటలు నిరవదికంగా ఇచ్చిన విద్యుత్తు నేడు ఏమైందని, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. భూములు ధరలు ఎందుకు తగ్గాపోయాయి, రాష్ట్రంలో నీళ్లు ఎక్కడికి పోయాయి? ధాన్యం కొనే వాడు లేడు,, కల్లాల్లో రైతులు ఏడుస్తున్నారని అన్నారు. రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుందని 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని గులాబి బాస్ ఫైర్ అయ్యారు.