
ప్రభుత్వ సొమ్ముతో సీఎం కేసీఆర్ తన సొంత మొక్కులు చెల్లించుకుంటున్నారని ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకులే కాదు జాతీయ మీడియా కూడా దీనిపై భారీ స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న వేళ వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి భారీగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మేధావులు సైతం ఈ విషయంలో కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.
మరో వైపు కేసీఆర్ మొక్కులపై విమర్శలు పెరుగుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ దీనిపై స్పందించే ప్రయత్నే చేయలేదు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. తన మొక్కులపై విమర్శలు చేస్తున్నవారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేనివారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
కొత్త గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తుంటే వాటిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు.
మొక్కుల చెల్లింపుపై కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం అందరి దేవుళ్లకు మొక్కుకున్నాని ఇప్పుడు వాటిని తీర్చుతున్నాని స్పష్టం చేశారు.
గతంలో తమ సొంత ఖర్చుతో యాగం చేస్తే దాని వివరాలు తెలుసుకోకుండా సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి వారు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.
ఉద్యమ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రం కోసం వీరభద్ర స్వామిని మొక్కుకున్నానని ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
కాలం చెల్లిన కమ్యూనిస్టులు కూడా తమపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ప్రజలు కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇస్తే 40 ఏళ్లు ఏమీ చేయలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చేస్తుంటే ప్రాజెక్టులకు అడ్డు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ది చీప్ లిక్కర్ పంచే కల్చర్ అని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం దొంగల ముఠా తయ్యారయ్యిందన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.