
తెలంగాణ సిఎం కెసిఆర్ మరోసారి పంటితో ముల్లు ఎత్తుగడను ప్రయోగించారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుపోయిన నేపథ్యంలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రోళ్లే మా బలం అంటూ ప్రకటన ఇచ్చారు కెసిఆర్. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంద్రోళ్ల మీద ప్రేమను కురిపించారు కెసిఆర్. హైదరాబాద్ లో ఆంధ్రోళ్ల కాలుకు ముల్లు కుచ్చుకుంటే నేనే పంటితో తీస్తా అని వారిలో తమ సర్కారు పట్ల విశ్వాసం కలిగేలా పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ సెటిలర్ల ప్రస్తావన రాలేదు కాబట్టి సిఎం పెద్దగా మాట్లాడలేదు.
కానీ డ్రగ్ మాఫియా, సినీ పరిశ్రమ లింకులపై పోలీసులు గట్టిగా విచారణ జరుపుతున్న తరుణంలో సీమాంధ్ర సినీ పెద్దలు తాము వైజాగ్ పోతామన్నట్లు మాట్లాడుకొచ్చారు. ఈ విషయమై ఢిల్లీలో ఉన్న కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్లే మా బలం అంటూ కామెంట్ చేశారు. దీంతో సీమాంధ్ర సెటిలర్లలో భయాందోళన కలగకుండా కెసిఆర్ ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ కేసులో తప్పు చేసిన వారినే టార్గెట్ చేస్తాం తప్ప... అందరినీ కాదన్న సంకేతం ఇవ్వడం కూడా కెసిఆర్ ఉద్దేశం అన్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది.
తెలంగాణ రాకముందు సీమాంధ్రులపై పలుమార్లు కెసిఆర్ విమర్శలు గుప్పించారు. కానీ తెలంగాణ వచ్చి, ఆయన సిఎం అయిన తర్వాత సీమాంధ్రుల పట్ల వివక్ష చూపిన దాఖలాలు లేవు. ఇక సీమాంధ్రకు చెందిన వెంకయ్య నాయుడుపై తెలంగాణ రాకముందు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు మీద కెసిఆర్ సర్కారు ఎనలేని ప్రేమను కురిపించింది. వెంకయ్య కొడుకు కంపెనీకి టెండర్లు లేకుండా కాంట్రాక్టు ఇచ్చి పోలీసు వాహనాలు కొనుగోలు చేసింది. దీనికితోడు వెంకయ్య కూతురు నడుపుతున్న స్వర్ణభారత్ ట్రస్టు వారు బాకీ ఉన్న అప్పులన్నీ రద్దు చేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.
సీమాంధ్ర కు సంబంధించిన ప్రజలే మా బలం అని కెసిఆర్ అన్నప్పటికీ సీమాంధ్ర నాయకులు కూడా కెసిఆర్ బలమే అన్నట్లు ఆచరణలో జరుగుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో వెంకయ్య నాయుడును కెసిఆర్ తనయుడు కెటిఆర్, మంత్రులు నాయిని, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు వెళ్లి కలిసి మొక్క ఇచ్చి సన్మానం చేశారు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ సిఎం కెసిఆర్ సీమాంధ్ర వాళ్లపై ఎనలేని అభిమానం చూపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు.