బీజేపీకి చెక్: హైద్రాబాద్‌‌లో భారీ సభ,కేసీఆర్ ప్లాన్ ఇదీ

By narsimha lode  |  First Published Dec 26, 2019, 8:15 AM IST

సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా హైద్రాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 



అమరావతి:సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 30వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉన్నారు. గాంధీ కావాలా, గాడ్సే కావాలా అనే నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

also read:భావసారూప్యత గల పార్టీలతో కలిసి పోరాటం: సీఏఏ, ఎన్ఆర్‌సీపై అసద్

Latest Videos

undefined

సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నేతలతో కలిసి బుధవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మూడు గంటలకు పైగా సీఎం కేసీఆర్ తో అసద్ భేటీ అయ్యారు. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ తో అసద్ చర్చించారు.

మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకొని హైద్రాబాద్‌లో గాంధీ కావాలా, గాడ్సే కావాలా అనే నినాదంతో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ సభకు బెంగాల్, కేరళ సీఎంలు మమత బెనర్జీ, పినరయి విజయన్‌లను  ఆహ్వానించాలని కేసీఆర్ తలపెట్టారని సమాచారం.వీరితో పాటు ఇంకా పలు పార్టీలకు చెందిన నేతలను ఆయన ఆహ్వానించే అవకాశం ఉంది.

సీఏఏ బిల్లుకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు చేసింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఎన్ఆర్‌సీ, సీఏఏల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో మెజారిటీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.దీంతో రాజకీయపార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడ అసదుద్దీన్ ఓవైసీ సభలను నిర్వహించాలని యోచిస్తున్నారు. మహాబూబ్ నగర్ లో కూడ అసద్ సభను నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన నిజామాబాద్ లో అసద్ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలకు వచ్చే ప్రజల స్పందన ఆధారంగా జనవరిలో సీఎం కేసీఆర్ హైద్రాబాద్ లో సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలని బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో గణనీయమైన బలాన్ని సంపాదించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. సీఏఏ, ఎన్ఆర్‌సీల అంశాన్ని అవకాశంగా తీసుకొని బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. సీఏఏను అమలు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రజలకు వివరించడం ద్వారా బీజేపీకి రాజకీయంగా చావుదెబ్బతీయవచ్చనే అభిప్రాయంతో కారు పార్టీ ఉంది.

తెలంగాణలో పార్టీని విస్తరించే లక్ష్యంతోనే ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ఈ శిబిరాల ముగింపును పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని టీఆర్ఎస్ బావిస్తోంది.ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడ సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టాలని బావిస్తోంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ హైద్రాబాద్ లో భారీ ర్యాలీని నిర్వహించనుంది.

వచ్చే ఏడాది జనవరి 30వ తేదీన కేసీఆర్ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పలువురు ముస్లిం పెద్దలను కూడ ఆహ్వానించనున్నారు.ముస్లిం పెద్దలను ఆహ్వానించే బాధ్యతను సీఎం కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి అప్పగించినట్టుగా తెలుస్తోంది.


 

click me!