దేవెగౌడకు కేసీఆర్ రూ.100 కోట్లు ఆఫర్ చేశారు

First Published May 1, 2018, 5:51 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తీవ్రమైన ఆరోపణలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెసు అనుకూల పార్టీలకు కేసిఆర్ డబ్బులు ఆఫర్ చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. 

కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేయాలని కేసిఆర్ ఆయా పార్టీలను కోరుతున్నారని, అందులో భాగంగానే కర్ణాటకలో దేవెగౌడకు వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసారని మంగళవారం మీడి.యా సమావేశంలో చెప్పారు. 

కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసిఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ బిజెపికి బీ టీమ్ అని అభివర్ణించారు. మంత్రి హరీష్ రావు మాటలు దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని అన్నారు. ప్రాణహిత, ఇందిరా రాజీవ్ సాగర్ లను ఆపింది హరీష్ రావు కాదా అని అడిగారు. రీడిజైన్ పేరుతో వేల కోట్లకు అంచనాలను పెంచారని ఆరోపించారు. 

కెసిఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ హమీల అమలుపై కాంగ్రెసు పార్టీ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. 

తన మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేర్చానని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. హామీల అమలుపై తాము చర్చకు సిద్ధమని అంటూ కేసిఆర్... నువ్వు వస్తావా... లేకుంటే నీ కొడుకు కేటీఆర్ ను పంపిస్తావా అని అడిగారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. 

పాలకులు మంచి జరగాలని కోరుకుంటారని, కేసిఆర్ లాగా భూకంపాలు రావాలని కోరుకోరని, కేసిఆర్ భూకంప ప్రకటనతోనే కేసిఆర్ మనస్తత్వం ఏమిటో అర్థమవుతోందని అన్నారు. 

click me!