కలెక్టర్ ఆమ్రపాలికి కోపమొచ్చింది

First Published May 1, 2018, 2:41 PM IST
Highlights

ప్రభుత్వ డాక్టర్లపై గరం గరం

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి బాగా కోపమొచ్చింది. వరంగల్ నగరంలోని ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నిర్వహణ విషయంలో ఆర్ఎంఓ డాక్టర్ శివకుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మీద ఆమ్రపాలి సీరియస్ అయ్యారు. ఉర్సు ఆసుపత్రి పూర్తి స్థాయి అభివృద్ధిలో భాగంగా సమీక్షా సమావేశాన్ని జరిపారు కలెక్టర్ ఆమ్రపాలి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు వారాల క్రితం ఆసుపత్రిలో మాతా, శిషు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటేషన్ లో ఉన్న వైద్యుల సేవలను ఉర్సు ఆసుపత్రిలో ఉపయోగించుకోవాలని, రోగుల సేవల కోసం స్కానింగ్ మెషిన్, వాటర్ ఫ్యూరిఫైర్, జనరేటర్ సౌకర్యం కోసం ఎస్టిమేషన్స్ అందించాలని ఆదేశించినా పురోగతి లేదన్నారు.

ఆసుపత్రిలో ఆపరేషన్ల సంఖ్య పెంచాలని తన ఆదేశాలను పట్టించుకోవడంలేదన్నారు. ఆదేశాలు పాటించిన అధికారులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొదటి హెచ్చరికగా ఈసారి మందలింపులతో వదిలేస్తున్నానని, రానున్న రోజుల్లో ఇలాగే చేస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్బిణిలను ఆసుపత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేసిన అనంతరం ఇంటి వద్దకు వదిలేందుకు 102 సేవలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు.

మొత్తానికి సరదాగా ఉండే కలెక్టర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు షాక్ తిన్నారు.

click me!