కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన : మందు, కోళ్లు పంచిన టీఆర్ఎస్ నేత.. వీడియో వైరల్

By Siva KodatiFirst Published Oct 4, 2022, 5:17 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం విజయదశమి సందర్భంగా కొత్త జాతీయ పార్టీని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ఓ టీఆర్‌ఎస్‌ నేత బహిరంగంగా మద్యం సీసాలు, చికెన్‌ పంపిణీ చేసి వివాదం సృష్టించారు.
 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కొత్త జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన జెండా, ఎజెండాను ఆయన ఇప్పటికే ఖరారు చేశారు. దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రత్యేక పూజలు కూడా చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఓ టీఆర్ఎస్ నేత చేసిన పని వివాదాస్పదమైంది. ఏకంగా ప్రజలకు కోళ్లు, మద్యం పంపిణీ చేసిన వ్యవహారంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 

వివరాల్లోకి వెళితే.. వరంగల్ నగరానికి చెందిన రాజనాల శ్రీహరి అనే టీఆర్ఎస్ నేత.. కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ హమాలీలకు మద్యం బాటిళ్లతో పాటు కోళ్లను పంపిణీ చేశారు. అలా దాదాపు 200 మందికి హమాలీలకు పంచారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజనాల శ్రీహరి స్పందించారు. దసరా కానుకగా హమాలీలకు మద్యం, కోళ్లు పంచడంపై కొందరు కావాలనే తప్పుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించడం సంతోషంగా వుందన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. జాతీయ రాజకీయాలలోనూ కేసీఆర్ తనదైన ముద్ర వేసుకుంటారని శ్రీహరి జోస్యం చెప్పారు. 

ALso REad:టార్గెట్ టీడీపీ.. ఏపీ రాజకీయ నేతలపై కేసీఆర్ ఫోకస్..!

ఇకపోతే... మంగళవారం ఉదయం 11 గంటలకు  తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహంచనున్నారు  జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు.  ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా  మార్చాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 5వ తేదీన నిర్వహించే సమావేశంలో తీర్మానం చేయనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ఈ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈ నెల 6వ తేదీన  అందజేయనుంది. 

 

| TRS leader Rajanala Srihari distributes liquor bottles and chicken to locals ahead of Telangana CM KC Rao launching a national party tomorrow, in Warangal pic.twitter.com/4tfUsPgfNU

— ANI (@ANI)
click me!