సన్నాసులకు ఇదే సమాధానం: కేసిఆర్, రైతు బంధుకు శ్రీకారం

First Published May 10, 2018, 1:03 PM IST
Highlights

అనుదీప్ ఆలిండియా టాప్ ర్యాంకర్ సాధించాడని, తెలివి లేదని వ్యాఖ్యానించిన సన్నాసులకు అదే శాపమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. 

కరీంనగర్:  తెలంగాణ తెలివి ఏందో రుజువు చేసింది కూడా పాత కరీంనగర్ జిల్లా అని, అనుదీప్ ఆలిండియా టాప్ ర్యాంకర్ సాధించాడని, తెలివి లేదని వ్యాఖ్యానించిన సన్నాసులకు అదే శాపమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలివి లేదన్న తెలంగాణ నుంచే ఆలిండియా ర్యాంక్ వచ్చిందని అన్నారు. ఏడు టాప్ ర్యాంకులు తెలంగాణకు వచ్చాయని అన్నారు.  

కరీంనగర్ అంటే తనకో సెంటిమెంట్ అని, కరీంనగర్ నుంచి ఏ పని మొదలు పెట్టినా వందకు వందశాతం విజయం సాధిస్తున్నామని, అందుకే రైతు బంధు పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. 

సింహగర్జన ఇక్కడి నుంచే ప్రారంభించామని, తెలంగాణ వస్తుందని అనుకోలేదని, చాలా మంది శాపాలు పెట్టారని, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఆకాశమంత ఎగురేసింది కరీంనగర్ జిల్లా అని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతు బంధు పథకాన్ని ఆయన గురువారంనాడు ప్రారంభించారు. తెలంగాణ వస్తే చీకటే అని హేళన చేశారని, ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. యావత్తు దేశానికే తెలంగాణ రైతు బంధు పథకం దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. భూ ప్రక్షాళన చేశామని చెప్పారు. ఇదో సువర్ణాధ్యాయమని అన్నారు. 

12 వేల కోట్ల వ్యయంతో రైతు బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. రైతులకు చెక్కు బుక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. రైతు బంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏటా  రైతులకు ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేస్తుంది.

ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ చేశామని కేసిఆర్ చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో లేదని అన్నారు. 20 శాతం సొంత రాబడి కలిగిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.  జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, సగం ప్రభుత్వం మరో సగం రైతు భరించాలని ఆయన అన్నారు.

click me!