తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకు ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ దక్కడం లేదు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లు ఈ నెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ మాత్రం దక్కలేదు.
ఈ నెల 3వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీకి వెళ్లారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ రాజీవ్ శర్మ కొడుకు పెళ్లి రిసెప్షన్ లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. మరో మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండాలని భావించారు. ఈ మూడు రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ లభిస్తే ఆయనను కలవాలని భావించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుండి మాత్రం సానుకూలమైన స్పందన రాలేదు. ప్రధాన మంత్రి మోడీ కేబినెట్ సమావేశాలతో బిజీగా ఉన్నాడని ప్రదానమంత్రి కార్యాలయం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సమాచారం వచ్చిందని సమాచారం.
దిశపై గ్యాంగ్‌రేప్ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై జాతీయ మీడియా కేసీఆర్‌ను ప్రశ్నించింది. దీంతో కేసీఆర్ న్యూఢిల్లీ నుండి అదే రోజు తిరిగి హైద్రాబాద్‌కు వచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాను కలవాలని జగన్ భావించారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, ఆర్ధిక పరమైన అంశాలను ప్రధానితో పాటు కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చించాలని జగన్ తలపెట్టారు. కానీ జగన్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సహాయకుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన న్యూఢిల్లీ నుండి వెంటనే తిరుగు పయనమయ్యారు.
కేంద్రంలో మోడీ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు దఫాలు మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కసారి మాత్రమే మోడీతో సమావేశమయ్యారు.
గత టర్మ్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కంటే ఎక్కువ దఫాలు తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి మోడీ అపాయింట్‌మెంట్ కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏడాది సమయం ఎదురుచూశారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు ఎన్డీఏ నుండి బయటపడ్డారు.