ESI Scam: విస్తుపోయే దేవికారాణి ఆస్తులు: అమరావతినీ వదల్లేదు

By telugu teamFirst Published Dec 18, 2019, 1:38 PM IST
Highlights

తవ్వుతున్న కొద్దీ దేవికారాణి ఆస్తులు బయటపడుతున్నాయి. అమరావతిలో దేవికారాణి తన పిల్లల పేరు మీద 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. తిరుపతిలో అల్లుడి పేరు మీద అపార్టుమెంటు కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించింది.

హైదరాబాద్: బీమా వైద్య సేవల విభాగం (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా విస్తుపోయే విధంగా ఉంది. తవ్వే కొద్దీ ఆమె ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఆమెకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను గుర్తించారు. ఆస్తులను కూడబెట్టుకునే విషయంలో ఆమె దేన్ని కూడా వదలినట్లు లేదు. 

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో తన పిల్లల పేరు మీద దేవికారాణి 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుర్తించింది. తన అల్లుడి పేరు మీద తిరుపతిలో 700 గజాల్లో జీ ప్లస్ ఫోర్ అపార్టుమెంటును కొనుగోలు చేసినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. 

రావిరాల హౌసింగ్ బోర్డులో ఓ ఇంటికి రూ.25 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్ లో ఏసీబీ కేసు నమోదు చేసింది. దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తితో పాటు మరో 19 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. 

దేవికా రాణి ఆస్తులను మరింత వెలికి తీయడానికి ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. దేవికారాణి కోట్ల ఖరీదు చేసే బంగారు ఆభరణాలను, స్థిరాస్తులను, బ్యాంకులు, బీమా సంస్థల్లో ఫిక్స్డ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. 

ఎస్బీఐలో 12 ఏఫ్డీలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 35 లక్ష విలువైన 9 ఏఫ్డీలను ఏసీబీ గుర్తించింది. బీమా సంస్థల్లో కూడా పెద్ద యెత్తున డిపాజిట్లు చేసినట్లు గుర్తించింది. ఆ వివరాలను అందజేయాల్సిందిగా ఏసీబీ ఎస్పీ, బీమా సంస్థలకు లేఖలు రాసింది.

click me!