Huzurabad bypoll: కేసీఆర్ కు బస్సు, కరెంట్ చార్జీ పెంపు సెగ, అందుకే...

Published : Sep 25, 2021, 07:59 AM IST
Huzurabad bypoll: కేసీఆర్ కు బస్సు, కరెంట్ చార్జీ పెంపు సెగ, అందుకే...

సారాంశం

బస్సు, కరెంట్ చార్జీల పెంపును వాయిదా వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ శాసనసభ ఎన్నిక తర్వాతనే ఆ చార్జీలను పెంచాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక (Huzurabad bypoll) నేపథ్యంలో ఆర్టీసీ, కరెంట్ చార్జీల పెంపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బస్సు, కరెంట్ చార్జీల పెంపు డిసెంబర్ లోనే ఉండవచ్చునని భావిస్తున్నారు. హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక నవంబర్ లో జరిగే అవకాశం ఉంది. 

బస్సు చార్జీల పెంపు, కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను దసరా పర్వదినం తర్వాత అక్టోబర్ లో సమర్పించాలని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రతిపాదలను టీఎస్ ఆర్టీసీ, టీఎస్ జెన్కో సమర్పించిన తర్వాత మంత్రివర్గం సమావేశమై వాటిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడే చార్జీలు పెంచితే హుజూరాబాద్ ఉప ఎన్నికపై ప్రతికూల ప్రభావం పడవచ్చునని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఎల్పీజీ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలపై మోయలేని భారం వేసిందని టీఆర్ఎస్ హుజూరాబాద్ ప్రచారంలో విమర్శిస్తోంది. దాంతో ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచితే తమపై విమర్శలు రావచ్చునని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో తాము ఆత్మరక్షణలో పడాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

సెప్టెంబర్ 21వ తేదీన కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ లో జరిగిన సమావేశంలో టీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచాలని అధికారులు కోరారు. కోవిడ్ మహమ్మారి వల్ల భారీ నష్టాలు వచ్చాయని, అందువల్ల చార్జీలు పెంచక తప్పదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుత బిజెపి నేత ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ శాసనసభ సీటు జూన్ 12వ తేదీన ఖాళీ అయింది. అందువల్ల అప్పటి నుంచి ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఆ రీత్యా ఈ ఉప ఎన్నిక డిసెంబర్ 12వ తేదీలోగా జరగాలి. ఈ స్థితిలో నవంబర్ చివరి వారంలో ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహిస్తోందని భావిస్తున్నారు. 

ఆర్టీనరి లేదా పల్లె వెలుగు బస్సు చార్జీలు 20 శాతం మేరకు, డీలక్స్, లగ్జరీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల చార్జీలు 30 శాతం మేరకు పెంచాలని టీఎస్ ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బస్సు చార్జీల పెంపు ఆలోచనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

హుజూరాబాద్ లో బిజెపి తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. ఆయన విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెసు నాయకత్వం పోటీకి దించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?