ప్రతిపాదనలు రెడీ: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రానికి కేసీఆర్ లేఖ

By telugu teamFirst Published Nov 27, 2019, 1:02 PM IST
Highlights

ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉంది. ఆర్టీసీకి చెందిన సగం రూట్లను ప్రైవేటీకరించాలని కేసీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై కేంద్రానికి సమాచారం ఇచ్చి ముందుకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు.

న్యూఢిల్లీ: దాదాపు సగం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ గురించి తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఆయన లేఖ రాస్తారని అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో కేంద్రానికి 30 శాతం వాటా ఉంది. ఈ దృష్ట్యా కూడా తాను తీసుకునే చర్యలకు కేంద్రం ఆమోదం అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ స్టేజ్ కారియర్ గా మాత్రమే పనిచేస్తుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. 

Also Read: ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్ కు గడ్కరీ మెలిక: జగన్ కు కూడా...

కొన్ని ఆర్టీసీ రూట్లను డీనోటిఫై చేసి ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాల్సిన అవసరం ఉందని, ఆర్టీసీ భారీ నష్టాల్లో కూరుకుపోయినందు వల్ల, రుణ భారం ఉన్నందున ఆ అవసరం ఏర్పడిందని కేసీఆర్ కేంద్రానికి తెలియజేస్తారని అంటున్నారు. ఆర్టీసీ 3,600 రూట్లలో మాత్రమే బస్సులను నడుపుతుందని కూడా తెలియజేసే అవకాశం ఉంది.

Also Read: ఆర్టీసీ సమ్మె: హక్కులను కాలరాయడమేనా....

మోటార్ వెహికిల్స్ చట్టం నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాల్సి ఉంటుంది. దానిపై ముందుగానే కేంద్రానికి సమాచారం ఇస్తే తన నిర్ణయాన్ని అమలు చేయడానికి చిక్కులు ఉండవని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రానికి లేఖ రాసిన తర్వాత సగం ఆర్టీసీ రూట్లను డీనోటిఫై చేసి, టెండర్లను ఆహ్వానిస్తారు టెండర్ల ద్వారా అనుమతి పొందిన ఆపరేటర్లు ఆ రూట్లలో 90 రోజుల లోగా బస్సులను నడపాల్సి ఉంటుంది. 

Also Read:మెట్టుదిగని కేసీఆర్.. ఆర్టీసీ జేఏసీ చివరి ఆశలు వారిపైనే...

ఆర్టీసీ ప్రైవేటీకరణకు అవసరమైన ప్రక్రియ యావత్తూ ముగిసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీపై ఇప్పటికే కేసీఆర్ విస్తృతమైన సమీక్ష చేశారు. గురువారం, శుక్రవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదనలను పెట్టి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేటీకరణ ప్రక్రియను అమలు చేయడానికి క్యాబినెట్ కమిటీని వేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

click me!