బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న కేసీఆర్ అధ్యక్షతన ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబర్ లో వరంగల్ లో బీఆర్ఎస్ మహాసభను నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ నెల 25వ తేదీన నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు పార్టీ పరిశీలకులు హాజరు కానున్నారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశానికి కనీసం మూడు వేల మందికి తక్కువ కాకుండా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని బీఆర్ఎస్ నాయకత్వం కోరింది. గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకోవాలని బీఆర్ఎస్ ఆదేశించింది. ఈ నెల 25వ తేదీన పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరగుతుందని, ఈ సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది.
ఆయా నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డ్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హజరుఅవుతారని పార్టీ తెలిపింది.
ఏప్రిల్ 27నహైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ రోజు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కెటిఅర్ తెలిపారు.
అదే రోజున తెలంగాణ భవన్ లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సూమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదిన వరంగల్ లో మహాసభ నిర్వహణ జరుగుతుందని కేేటీఆర్ ఆ ప్రకటనలో వివరించారు
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలు
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ముగ్గురు ఇంచార్జీలను కేసీఆర్ నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జీగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీగా ఎంపీ మాలోతు కవితలను పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర రావు నియమించారు.
వీరు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారని కేటీఆర్ ఆ ప్రకటనలో వివరించారు. .