
Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు… ప్రెస్ మీటు పెట్టిమరీ సొంత కుటుంబసభ్యులే కాదు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ లైన్ ను ఆమె పూర్తిగా దాటినట్లు అదినేత కేసీఆర్ భావించినట్లున్నారు… అందుకే సొంత కూతురని కూడా చూడకుండా చర్యలు తీసుకున్నారు. ఆమెను బిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారికంగా కవిత సస్పెన్షన్ గురించి ప్రకటించింది. ఇటీవలకాలంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని... దీనివల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉండటంతో అదిష్టానం తీవ్రంగా పరిగణించిందని బిఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకే కవితను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇలా బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి. రవిందర్ రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ పేరిట అధికారిక ప్రకటన వెలువడింది.
భారత రాష్ట్ర సమితి నుండి వేటు తప్పదని ముందే గుర్తించిన కవిత సొంత రాజకీయాలకు ముందుగానే సిద్దమయ్యారు. తండ్రికి తాను రాసిన లేఖ బైటికి వచ్చినప్పటి నుండి కవిత బిఆర్ఎస్ కు దూరంగానే ఉంటున్నారు.. తెలంగాణ జాగృతి ద్వారా సొంతంగా రాజకీయ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా ఆమెను బిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత కొత్తపార్టీ పేరు ఇదేనంటూ ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటికే కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తిచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవిత బిసి నినాదంతో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే… ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ బిసి బహుజన్ సమాజ్ పేరుతో పార్టీని పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో TRS పేరును కూడా ఆమె పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ అలాగే వుండటం, టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా వినిపిస్తుండటంతో పొలిటికల్ గా తనకు ఈజీగా వుంటుందనే కవిత TRS పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన నేపథ్యంతో తన రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియజేసేందుకు కవిత మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. బుధవారం మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ సమయంలో ఆమె ఏం చెప్తారన్నది ఆసక్తిరంగా మారింది. ఇప్పటికైతే కవిత తన తండ్రి స్థాపించిన పార్టీకి దూరమైనట్లే… ఇక ఈ పార్టీని కేటిఆర్, హరీష్ రావు ముందుండి నడపనున్నారు. కేసీఆర్ తెరవెనక ఉంటే పార్టీని బలోపేతం చేసేందుకు మాస్టర్ ప్లాన్స్ రచించనున్నారు. ఎప్పటిలాగే సంతోష్ రావు కేసీఆర్ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారు.