కేసీఆర్ పాలనపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ సర్కార్ పథకం మోసమేనని షర్మిల ఆరోపించారు.
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో ప్రతి పథకం మోసమేనని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆమె పలు చోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణలో నిలిపివేశారన్నారు. రైతు ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కార్ ప్రచారం చేసుకుంటుందన్నారు. రైతు ప్రభుత్వంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె విమర్శించారు. మంచివారికి ఓటేస్తేనే ప్రజల జీవితాలు బాగుపడుతాయన్నారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి మోసపోకూడదని ఆమె కోరారు.
గత కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆమె తీవ్ర విమర్శలుచేశారు. ప్రజలు చర్చించుకొనే అంశాలనే తాను ప్రస్తావించినట్టుగా షర్మిల మీడియాకు చెప్పారు. తాను చెప్పిన మాటల్లో అవాస్తవాలు లేవన్నారు. షర్మిల చేసిన విమర్శలపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కూడ ఆమె స్పందించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పీకర్ తీసుకొనే నిర్ణయంపై తాము చట్టపరంగా ఎదుర్కొంటామని కూడా షర్మిల ప్రకటించారు.నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం నాడు దీక్షలు చేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయనుందని షర్మిల ఇదివరకే ప్రకటించారు.