తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఏర్పాట్లపై సమావేశం.. ఆ ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం..

Published : Oct 09, 2022, 04:12 PM IST
తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఏర్పాట్లపై సమావేశం.. ఆ ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం..

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ నెల 23న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ నెల 23న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో రాహుల్ యాత్రను విజయవంతం చేసేలా టీపీసీసీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే రాహుల్ యాత్ర ఏర్పాట్లపై ఓ హోటల్ లో మెదక్, సంగారెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 

అయితే సమావేశంలో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ ఓటమికి సంబంధించి.. ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. అయితే ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వారికి సర్ది చెప్పారు. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళలో యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్..  సెప్టెంబర్ 30న కేరళ సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించారు. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 6వ తేదీన రాహుల్ పాదయాత్రలో ఆయన తల్లి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. 

రాహుల్ యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తొలుత వెల్లడించారు. అయితే అందుకు ఒక రోజు ముందుగానే రాహుల్ యాత్ర తెలంగాణ‌లోకి ఎంటర్ అవుతుందని నేతలు తెలిపారు. ఈ నెల 23న ఉదయం 7 గంటలకు రాహుల్ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 31న ఇందిరా గాంధీ వర్దంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో భారీ కార్యక్రమం ఏర్పాటు చేశామని.. ఆ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. రెండు రోజుల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్‌పై మరింత స్పష్టత ఇవ్వనున్నట్టుగా పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా