సీఎం కేసీఆర్ బాధితుల సంఘానికి నేనే అధ్యక్షుడిని, నాకు అన్యాయం జరిగింది కాబట్టే గజ్వేల్‌లో పోటీ చేయడానికి వచ్చానని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమంలో తన పాత్ర ఏమిటో, తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు అని వివరించారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. హుజురాబాద్‌తోపాటు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచీ బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్‌లాగే ఈటల రాజేందర్ కూడా ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్నారు. కేసీఆర్‌కు గట్టి సవాల్ ఇచ్చే నేతగా ఈటల రాజేందర్ పై అంచనాలు ఉన్నాయి. దీంతో గజ్వేల్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ రోజు ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలనూ ఆయన వెల్లడించారు. తాను దిక్కులేక గజ్వేల్‌కు రాలేదని ఈటల తెలిపారు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే.. కేసీఆర్‌తో ఢీ కొట్టడానికి వచ్చానని వివరించారు. తాను కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షుడినని చెప్పారు.
Also Read : సీఎం కేసీఆర్ పై అత్యధిక నామినేషన్లు.. అసలైన సవాల్ ఏమిటీ? ఒక్క ఈవీఎం ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగించవచ్చు?
ఉద్యమంలో తన పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసు అని ఈటల రాజేందర్ అన్నారు. తన గురించీ తెలంగాణ ప్రజలకూ తెలుసు అని వివరించారు. ప్రభుత్వ అధికారులను బీఆర్ఎస్ పార్టీ ప్రభావితం చేస్తున్నదని ఆరోపించారు. గజ్వేల్‌లో సుమారు 170 మంది పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారట అని అన్నారు. అంతేకాదు, వారు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారట అనీ చెప్పారు.