రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను పప్పు అని విమర్శించడాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. అలా దూషించడాన్ని తాను వ్యతిరకిస్తానని చెప్పారు. అయితే.. పప్పు మంచిదేనని, అందరూ పప్పును ఇష్టంగా తింటారు అని వివరించారు. సీఎం పదవి, బిడ్డ జయా రెడ్డి ఎంపీగా పోటీ చేయడంపైనా ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పప్పు అని పిలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పప్పు మంచిదే కదా.. మనం రోజు తింటాం. రుచికరంగా ఉంటుంది. పప్పు తినడాన్ని ఇష్టపడతాం కదా.. అని జగ్గారెడ్డి అన్నారు. అయితే.. ఈ పదాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అవమానించేలా ఉపయోగించడం సరికాదని వివరించారు. అలా తిట్టవొద్దని కేసీఆర్, కేటీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదని అన్నారు. రాహుల్, రేవంత్‌లను పప్పు అని తిట్టడాన్ని సమర్థించబోనని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అంటే కాళేశ్వరం అని, కాంగ్రెస్ అంటే శనేశ్వరం అని విమర్శలు రావడంపైనా ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని, రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీపై దుష్ప్రచారం చేయడానికే ఆ వ్యాఖ్యలు అని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను పక్కనపెడితే శని దేవుడిని నెగెటివ్ కోణంలో మాట్లాడరాదని అన్నారు. శనిదేవుడికి ఎందుకు అభిషేకం చేస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టే.. సీఎం గురించి మాట్లాడుతారని, కానీ, అధిష్టానం చెప్పినవారే సీఎం అవుతారని, మిగిలినవారమంతా ఆయనకే మద్దతు తెలుపుతామని వివరించారు. తాను ఇప్పుడు సీఎం బరిలో లేనని, పదేళ్లలోపు సీఎం అవుతానని అనుకుంటున్నట్టు చెప్పారు.
Also Read: కేసీఆర్‌పై అత్యధిక నామినేషన్లు.. అసలైన సవాల్ ఏమిటీ? ఒక్క ఈవీఎం ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగించవచ్చు?
తన బిడ్డ జయా రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు జగ్గా రెడ్డి చెప్పారు. ఇప్పుడు తానే పోటీలో ఉన్నాను కాబట్టి, తాను ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని జయా రెడ్డి భావిస్తున్నట్టు వివరించారు. మెదక్ లోక్ సభ ఎంపీగా జయా రెడ్డిని బరిలోకి దించాలని జగ్గా రెడ్డి భావిస్తున్నట్టు గతంలో ప్రచారం జరిగింది.