కేసీఆర్‌పై అత్యధిక నామినేషన్లు.. అసలైన సవాల్ ఏమిటీ? ఒక్క ఈవీఎం ఎంతమంది అభ్యర్థులకు ఉపయోగించవచ్చు?

By Mahesh K  |  First Published Nov 12, 2023, 7:44 PM IST

కేసీఆర్ పై అత్యధిక నామినేషన్లు పడ్డాయి. గజ్వేల్, కామారెడ్డిల్లో కలిపి ఆయనపై 235 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక ప్రధాన అభ్యర్థి టార్గెట్‌గా ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే వచ్చే ముప్పు ఏమిటీ? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను చూద్దాం. ఈవీఎంపై ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎలాంటి గందరగోళానికి లోనవుతారు? అనే కోణంలో ఈ సమస్యను చూడాలి.
 


హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నవారు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఆయనపై నామినేషన్లు వేసి తమ అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిన సంగతి తెలిసిందే. 119 అసెంబ్లీ స్థానాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 145 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఆయన పోటీ చేస్తున్న కామారెడ్డిలోనూ మొత్తం 92 మంది బరిలో ఉన్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే వచ్చే ప్రమాదం ఏమిటీ? ప్రధాన అభ్యర్థికి ఎదురయ్యే సవాల్ ఏమిటీ? ఈవీఎంలు ఎంతమంది అభ్యర్థులకు సేవలు అందించగలుగుతుంది?

ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే ప్రధాన అభ్యర్థికి రెండు రకాల పర్సెప్షన్, టెక్నికల్ సవాళ్లు ఉంటాయి. ఒకటి ప్రధాన అభ్యర్థిపై ఎక్కువ మంది పోటీ చేసి తమ వ్యతిరేకతను బహిరంగంగా.. నియోజకవర్గ స్థాయిలో వెల్లడించుకుంటారు. అంతేకాకుండా వారు ప్రచారం చేసినా ప్రధాన అభ్యర్థే టార్గెట్‌గా ఉంటారు. ఒక రకమైన వ్యతిరేక వాతావరణాన్ని వీరు సులువుగా నిర్మించగలుగుతారు.

Latest Videos

Also Read: Telangana Elections: మరో జనసేన పార్టీతో పవన్‌కు కొత్త చిక్కులు.. ఈ కన్ఫ్యూజన్‌ను ఎదుర్కొనేదెలా?

ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల విషయమై ఉంటుంది. ఒక బ్యాలెట్ యూనిట్ పై నోటా సహా 16 ఆప్షన్స్ ఉంటాయి. అయితే, ఒక్క కంట్రోల్ యూనిట్‌కు 24 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయవచ్చు. అంటే గరిష్టంగా నోటా సహా 384 అభ్యర్థులకు ఒక ఈవీఎం సెట్ సేవలు అందించగలుగుతుంది. అయితే, అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేస్తే బ్యాలెట్ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. తద్వార ఒక అభ్యర్థి పేరును, ఆ గుర్తును ఈవీఎంపై వెతికి పట్టుకోవడం కష్టతరం అవుతుంది. ఈ క్రమంలో వయోవృద్ధులు, నడి వయస్కులు కూడా సదరు అభ్యర్థిని వెతికే ఓపిక కోల్పోతే వేరే అభ్యర్థికి ఓటు వేసే ముప్పు ఉంటుంది. 

Also Read: తెలంగాణలో కర్ణాటక రాజకీయం.. అధికార, ప్రతిపక్ష నేతల మాటల తూటాలు.. బీఆర్ఎస్‌కు కలిసొచ్చేనా?

ఈ సమస్యను అభ్యర్థులు సాధారణంగా వారి నెంబర్ చెబుతుంటారు. ఈవీఎంలపై నెంబర్, అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తు ఉంటుంది. ఎంత మంది పోటీ చేసినా సదరు నెంబర్‌ను ఓటర్ల మధ్యలోకి విజయవంతంగా తీసుకువెళ్లగలిగితే ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే, ఇది అంత సులువేమీ కాదు. అందుకే బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ పై నిరసనకారులు వేసిన నామినేషన్లను వెనక్కి తీసుకునేలా చేయడానికి బుజ్జగింపులు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది.

click me!