అడవుల పునరుద్దరణకు చర్యలు: కలెక్టర్లకు కేసీఆర్ ఆదేశం

By narsimha lodeFirst Published Aug 21, 2019, 6:04 PM IST
Highlights

అడవుల పునరుద్దరణ  కోసం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని  తెంగాణ సీఎం కేసీఆర్ కలెక్టర్లను కోరారు. 


హైదరాబాద్:అడవుల పునరుద్దరణకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను కోరారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగాయిపల్లి, కోమటిబండ తదితర గ్రామాల్లో కేసీఆర్ కలెక్టర్లతో కలిసి పర్యటించారు.గజ్వేల్ నియోజకవర్గంలో మూడేళ్ల క్రితం చేపట్టిన అడవుల పునరుద్దరణ కార్యక్రమం ఫలితాలను ఇస్తోందని కేసీఆర్ చెప్పారు.

సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందన్నారు.
వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి అడవులు దోహద పడతాయని సీఎం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్టు చెప్పారు.

 మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని సీఎం అన్నారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం  కూడా పెరిగిందన్నారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడంతో మంకీ ఫుడ్ కోర్టుల లాగా తయారవుతున్నాయని సీఎం చెప్పారు.

 గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. రాష్ట్ర భూభాగంలో ఇది 23.4శాతం అని సీఎం అన్నారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవన్నారు సీఎం కేసీఆర్

గజ్వేల్ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ ను ఉపయోగించుకొని అడవుల్లో సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. 

అడవి చుట్టూ కందకాలు తీసామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ, సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని అన్నారు. 

కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందన్నారు. 27రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. 

అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు.

 అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. 

పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు. 

ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

click me!