మాటలతో యుద్ధం కాదు చేతల్లో చూపించండి: బీజేపీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్

By Nagaraju penumalaFirst Published Aug 21, 2019, 2:51 PM IST
Highlights

కేసీఆర్ వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నందుకు జీవన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అవినీతికి ద్వారాలు తెరవడం మినహా కేసీఆర్ సాధించిందేమీ లేదని మండిపడ్డారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? అని ప్రశ్నించారు. 
 

హైదరాబాద్: కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పుట్టిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అవినీతిని తగ్గిస్తామంటూనే కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం,మిషన్ భగీరథ వంటి పథకాలపై కేంద్రప్రభుత్వం విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడితప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని అంగీకరించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ తన పాలన అవినీతిమయమైందని గుర్తించారని చెప్పుకొచ్చారు. 

కేసీఆర్ వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నందుకు జీవన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అవినీతికి ద్వారాలు తెరవడం మినహా కేసీఆర్ సాధించిందేమీ లేదని మండిపడ్డారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? అని ప్రశ్నించారు. 

రెవెన్యూ అధికారులను కట్టడి చేయాల్సింది కలెక్టర్లు కాదా?, కలెక్టర్లలను అదుపు చేయాల్సింది సీఎం కాదా? అని జీవన్‌రెడ్డి నిలదీశారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు సీఎం అధికారులను బలిచేస్తున్నారని విమర్శించారు. 

కేసీఆర్ ముందుగా రాజకీయ అవినీతిని తగ్గించి ఆ తర్వాత అధికారుల గురించి మాట్లాడాలని హితవు పలికారు. టీఆర్ఎస్‌పై బీజేపీ నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను తాను కూడా సమర్థిస్తున్నట్లు తెలిపారు. 

బీజేపీ ఇప్పటికైనా టీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడటం సంతోషమన్నారు. బీజేపీ నేతలు మాటలతో యుద్ధం కాకుండా చేతల్లో చూపించాలని జీవన్ రెడ్డి సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో  జరిగిన అవినీతిని వెలికి తీయాని బీజేపీని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 

click me!