
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో కలిసినడిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు ఆయన పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నారు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల సభకు సీఎం వచ్చినప్పుడు కూడా కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఓయూ విద్యార్థులు గళమెత్తారు.సీఎం కూడా ఓయూ ఉత్సవాల సభలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
గతంలో కూడా కేసీఆర్ ఓయూ విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఓయూ భూములను స్థానికులకు పంచుతామని ప్రకటించారు.ఇక ఉద్యోగ నియామకాలపై కూడా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు.
దీంతో సహజంగానే కేసీఆర్ పై వ్యతిరేకత పెంచుకున్న ఉస్మానియా విద్యార్థులు ఆయన పేరు చెబితేనే ఇప్పుడు మండిపడుతున్నారు.
ఓయూ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన ఖవ్వాలిలో ఓ గాయకుడు కేసీఆర్ పేరు ప్రస్తావించగానే అక్కడున్న విద్యార్థులు రచ్చ రచ్చ చేశారు. చివరకు జై తెలంగాణ అని నినదించడంతో శాంతించారు.