కార్తీకపౌర్ణమి ఈ యేడు సోమవారం రావడంతో భక్తులు మరింత పవిత్రంగా భావిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడిని ప్రార్థించడానికి బారులు తీరుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే శివాలయాల్లో వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివనామస్మరణలతో ఆలయాలను హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలతో తమ ఇష్టాదైవాన్ని కొలుస్తున్నారు. నదులలో కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలను ఆచరించి కార్తిక దీపారాధనలు చేస్తున్నారు. శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
తెలంగాణలోని వరంగల్ భద్రకాళి ఆలయం, అన్నవరం, ద్వారకాతిరుమలలో భక్తుల సందడి కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు. ఇక్కడ తెల్లవారుజాము నుంచి మల్లికార్జున స్వామికి అభిషేకాలు జరిగాయి.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోడీ..
నిర్మల్ జిల్లాలో కూడా అన్ని ఆలయాల్లో కార్తీక శోభసంతరించుకుంది. హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి సిద్దేశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయాలు, కురవి వీరభద్ర స్వామి, అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కూడా తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి దీపారాధనలు చేస్తున్నారు,
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, భద్రాచలంలోని గోదావరి నది, విజయవాడలోని కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఈరోజు అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో వ్రతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. ఇక పిఠాపురం పాదగయ క్షేత్రంలో కూడా శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ ఉన్న పాదగయ పుష్కరిలో పవిత్ర స్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వెలిగించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి గోదావరి ఘాట్లలో తెల్లవారుజాము నుంచి కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. రాజమండ్రిలోని మార్కండేయ స్వామి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం,కోటిపల్లి మురుమళ్ళ ముక్తేశ్వరంలోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయాలు పెద్ద ఎత్తున భక్తులతో నిండిపోయాయి.