కాళేశ్వరం పంపు హౌస్ మునక ప్రకృతి వైపరిత్యం.. 500 ఏళ్లలో అత్యధిక వరదలు.. యాసంగికి సరిపడా నీరు: మంత్రి హరీష్

Published : Sep 07, 2022, 01:10 AM IST
కాళేశ్వరం పంపు హౌస్ మునక ప్రకృతి వైపరిత్యం.. 500 ఏళ్లలో అత్యధిక వరదలు.. యాసంగికి సరిపడా నీరు: మంత్రి హరీష్

సారాంశం

కాళేశ్వరం పంపు హౌస్ మునిగిపోవడం ప్రకృతి వైపరిత్యం వల్లే జరిగిందని, ఇందులో మానవ తప్పిదం ఏమీ లేదని రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో వరదలు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాటి మరమ్మతును ఏజెన్సీతో చేయిస్తుందని తెలిపారు. యాసంగికి రైతులకు సరిపడా నీరు అందిస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్: కాళేశ్వరం పంపు హౌస్ మునకపై ప్రతిపక్షాలు హుషారుగా ఉన్నాయని, కానీ, వారి కలలు కల్లలే అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సానుకూల నిర్ణయాలు తీసుకున్నదని, భవిష్యత్‌లోనూ వారికి నష్టం కలుగదని స్పష్టం చేశారు. కాళేశ్వరం పంపు హౌస్ మునగడం ప్రకృతి వైపరిత్యం అని వివరించారు. ఇది మానవ తప్పిదం అసలే కాదని పేర్కొన్నారు. ఎందుకంటే.. గోదావరిలో ఈ స్థాయిలో వరదలు గతంలో రాలేవని వివరించారు. గత
500 ఏళ్లలో అత్యధిక వరదలు ఈ సారే వచ్చాయని తెలిపారు. పంపు హౌస్ మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండానే ఏజెన్సీ చేపడుతుందని వివరించారు. అన్నారం పంపులు సెప్టెంబర్ మూడో వారంలో, మేడిగడ్డ పంపులు అక్టోబర్ చివరి వారంలో పని చేస్తాయని పేర్కొన్నారు. శాసన మండలిలో చట్టసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.

మన దేశంలో గంగానది తర్వాత గోదావరి రెండో అతిపెద్ద నది అని ఆయన వివరించారు. ఈ నది చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. జులై 8 నుంచి 13వ తేదీల మధ్య 248 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిందని, గతంలో ఈ సమయంలో ఎన్నడూ ఈ స్థాయిలో వర్షాలు పడలేదని వివరించారు. గోదావరి నది చరిత్రలో 1986లో వరదలు వచ్చాయని సీడబ్ల్యూసీ లెక్కలు ఉన్నాయని, 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింనది, మొన్న 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని పేర్కొన్నారు. గతంలో కన్నా 1.2 మీటర్ల వరద ఎక్కువ రావడంతో పంపులు మునిగాయని వివరించారు. దీన్ని ప్రభుత్వ ఫెయిల్యూర్‌గా చూపి.. మానవ తప్పిదం అనే రకంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. గోబెల్స్ ప్రతిపక్షాల రూపంలో ఇక్కడ ఉన్నారని ఫైర్ అయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పంప్ హౌస్‌లో నీరు వస్తే పంట పండినంతగా ప్రతిపక్షాల రాక్షసానందం పొందాయని విమర్శలు చేశారు. లక్ష కోట్ల ప్రాజెక్టు మునిగిందని, నాలుగేళ్లు నీరు రాదన్నారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంలో 21 పంపు హౌస్‌లుఉంటాయని, నదిని ఆనుకుని ఉన్న మేడిగడ్డ, అన్నారం పంపు హౌస్‌లోకి మాత్రమే నీరు వచ్చిందని వివరించారు. దీనికి ప్రాజెక్టు అంతా మునిగిపోయినట్టు విషం చిమ్మేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

ప్రాజెక్టు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుందని, మరమ్మతులు ఏది వచ్చినా ఏజెన్సీదే బాధ్యత ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కాబట్టి, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని, జరిగిన నష్ం అంతా ఏజెన్సీ ద్వారానే చేయిస్తాం అని వివరించారు. ప్రతిపక్షాలు ఇకా నీళ్లు రానే రావన్నారని, కానీ, అన్నారం పంప్ హౌస్ సెప్టెంబర్ మూడో వారంలో,  మేడిగడ్డ అక్టోబర్ నెలాఖరులోగా నీళ్లు పోయడం ప్రారంభిస్తాయని వివరించారు. ఈ యాసంగికి రైతులు ఎంత కోరుకుంటున్నారో.. ఆ మేరకు నీటిని అందిస్తామని తెలిపారు. 

కేంద్రమంత్రి ఒక్క ఎకరానికి కూడా నీరురాలేదంటారని గుర్తు చేస్తూ ఒక్క ఎకరానికి నీరు రాకపోతే ఇంత పంట ఎలా పండిందని వివరించారు. 2014 -15లో రాష్ట్రంలో వరి ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు.. గతేడాది మన రాష్ట్రంలో 2 కోట్ల 59 లక్షల మెట్రిక్ టన్నులు పంట పండిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంట పండింది.

యాసంగికి ఒక్క గుంట కూడా ఎండకుండా కాళేశ్వరం నీరు అందిస్తామని వివరించారు. తెలంగాణ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఏజెన్సీ ద్వారానే పంపు హౌస్‌లు మరమ్మతులు చేయిస్తోందని తెలిపారు. ఎలక్ట్రిక్ టవర్స్ పడిపోవడం వల్ల పవర్ సప్లై బంద్ కావడం, పంప్ హౌస్‌లోకి వచ్చే నీటిని తోడిపోయడం సాధ్యపడలేదని, అందువల్లే పంపు హౌజ్‌లోకి నీరు రావడం జరిగిందని వివరించారు. 

శ్రీరామ్ సాగర్ నుంచి వరద వచ్చి మిడ్ మానేరుకు చేరిందని, మిడ్ మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు, అన్నపూర్ణ రిజర్వాయర్‌కు, అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక్ సాగర్‌కు అక్కడి నుంచి మల్లన్న సాగర్‌కు, అక్కడి నుంచి కొండ పోచమ్మ సాగర్‌కు నీళ్లు తెచ్చి పెట్టుకున్నామని వివరించారు. వర్షాలు బాగా పడటం వల్ల కొండపోచమ్మ సాగర్‌లో 15, మల్లన్న సాగర్‌లో 14, అనంతగిరిలో 2 టీఎంసీలు, రంగనాయక్ సాగర్‌లో 2 టీఎంసీలు నింపి పెట్టుకున్నామని, కాబట్టి, యాసంగి పంటకు నీటికి కొదవలేదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?