బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల మధ్య బలమైన బంధం ఉండేలా.. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. అయితే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయని.. అయితే తనను ఎవరూ పిలివలేదని చెప్పారు. ఇందుకు కారణమేమిటో తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను స్థానిక స్థానిక నాయకులు పాటించడం లేదని విమర్శించారు. ఇది చాలా విచారకరమైన విషయమని పేర్కొన్నారు.
అయితే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో చాలా కాలంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరువురు నేతలు నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో ఇరువురు నేతలు విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని కడియం శ్రీహరి కామెంట్ చేయడంపై రాజయ్య ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.