కడియం శ్రీహరికి ఇంటి పోరు: కూతురు కావ్య తిరుగుబాటు?

By pratap reddyFirst Published Oct 19, 2018, 10:21 AM IST
Highlights

రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆందోళనలు చెలరేగాయి. ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు కూడా వచ్చాయి. రాజయ్య తమకు వద్దంటూ ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావుకు విన్నవించుకున్నారు.

వరంగల్:  తెలంగాణ ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కడియం శ్రీహరి ఇంటిపోరును ఎదుర్కుంటున్నారు. టీఆర్ఎస్ పై ఆయన కూతురు కావ్య తిరుగుబాటుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు చాలా కాలం ముందే ఆయన తన కూతురు కావ్యను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగించారు. 

స్టేషన్ ఘన్‌పూర్‌లో తన కూతురు కావ్యను పోటీకి దించేందుకు రెండేళ్లుగా కసరత్తుగా సాగించారు. స్థానిక శాసనసభ్యుడు రాజయ్యపై వ్యతిరేకత ఉన్నందున, ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నందున ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కదని భావిస్తూ వచ్చారు. కానీ, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు తిరిగి ఆయనకు టికెట్ ఖరారు చేశారు. దాంతో కడియం శ్రీహరి ఆశలు నీరుగారాయి.

అయినప్పటికీ ఆయన తన పట్టు వీడలేదు. రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆందోళనలు చెలరేగాయి. ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు కూడా వచ్చాయి. రాజయ్య తమకు వద్దంటూ ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావుకు విన్నవించుకున్నారు. రాజయ్య స్వయానా కడియం శ్రీహరి కాళ్లకు మొక్కారు.

ఈ స్థితిలో కడియం శ్రీహరిని పిలిచి కేటీఆర్ మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినా రాజయ్య అభ్యర్థిత్వాన్ని మార్చడానికి కేసీఆర్ ఇష్టపడలేదు. స్టేషన్ ఘనపూర్ లోనే కాకుండా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి లేకుండా చూడాలని కడియం శ్రీహరిని ఆదేశించినట్లు సమాచారం.

తన శిష్యురాలు సత్యవతి రాథోడ్ తో కలిసి కడియం శ్రీహరి పార్టీ మారుతారంటూ ప్రచారం కూడా సాగింది. స్టేషన్ ఘనపూర్ కాకపోతే తన కూతురికి వర్ధన్నపేట టికెట్ అయినా ఇవ్వాలని కడియం శ్రీహరి అడిగినట్లు చెబుతారు. అయితే, అటువంటి ప్రచారాన్ని కడియం శ్రీహరి కొట్టిపారేశారు. తాను పార్టీ మారేది లేదంటూ చెప్పారు.

అయితే, కడియం శ్రీహరికి ఇప్పటికీ ఇంటి పోరు తప్పలేదని అంటున్నారు. తన భవిష్యత్తును పక్కన పెట్టి ఎలా నిర్ణయం తీసుకుంటారని కూతురు కావ్య కడియం శ్రీహరిని నిలదీసినట్లు చెబుతున్నారు. ఇదే స్థితిలో ఆమె కాంగ్రెసులో చేరే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం ముందుకు వచ్చింది. కాంగ్రెసు కాకపోతే ఇండిపెండెంట్ గా స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీకి దిగడానికి ఆమె సిద్ధపడినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

సంబంధిత వార్తలు

పంచాయితీ: రాజయ్యకు వ్యతిరేకత, కడియం కూతురు కోసమేనా?

పార్టీ మారనున్న కడియం శ్రీహరి..?

 

click me!