సమ్మె బాట పట్టిన తెలంగాణ జూనియర్ డాక్టర్లు: ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సర్కార్

By narsimha lodeFirst Published May 26, 2021, 10:09 AM IST
Highlights

తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు బుధవారం నాటి నుండి సమ్మె బాట పట్టారు.  అత్యవసర విధులు మినహా ఇతర విధులను బహిష్కరించాలని జూడాలు నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు బుధవారం నాటి నుండి సమ్మె బాట పట్టారు.  అత్యవసర విధులు మినహా ఇతర విధులను బహిష్కరించాలని జూడాలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఈ  నెల 10వ తేదీన డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చంది. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో  సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా అసోసియేషన్ ప్రకటించింది.

ఇవాళ, రేపు అత్యవసర  విధులను మాత్రమే నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే  అన్ని రకాల విధులను బహిష్కరించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 6 వేల మంది జూనియర్ డాక్టర్లు, మరో వెయ్యి మంది సీనియర్ రెసిడెంట్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వీరి సేవలే కీలకం కానున్నాయి.

జూనియర్ డాక్టర్లతో పాటు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసిసోయేషన్ కూడ సమ్మెకు దిగనుంది. ఇప్పటికే ఈ సంఘం నేతలు కూడ డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చారు. బుధవారం నాడు ఉదయం నుండి కోవిడ్ అత్యవసర, ఐసీయూ అత్యవసేవలకు మాత్రమే హాజరౌతామని ప్రకటించారు. 

ఈనెల 19న గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ జూడాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై తనకు వెంటనే ప్రతిపాదనలను పంపాలని కూడ ఆదేశించారు. అయినా కూడ ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాలేదని జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చెబుతున్నారు. అనివార్య పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నట్టుగా వారు చెప్పారు. ఇదిలా ఉంటే జూనియర్ డాక్టర్లు సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కూడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. కరోనా రోగుల చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
 

click me!