
Jubilee Hills Bypoll 2025 : జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను తరలుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 6 గంటలకు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
గత నెల రోజులుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఓటర్లు తీర్పు చెప్పే సమయం... ఇవాళ (నవంబర్ 11న) పోలింగ్ జరుగుతోంది.
సోమవారం సాయంత్రానికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున ఈవిఎం మిషన్లు, వివి పాట్లు సిద్దం చేసి నమూనా పోలింగ్ నిర్వహించారు. అంటే జూబ్లిహిల్స్ పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటుహక్కును వినియోగించుకుంటారు... వారి ఎదుటే ఈవిఎం పనితీరును పరిశీలించారు. అంతా సరిగ్గా ఉందని నిర్దారించుకున్నాకే పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
జూబ్లిహిల్స్ అసెంబ్లీ పరిధిలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ ఎలాంటి ఘటనలు జరక్కుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 1761 మందికిపైగా పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 2వేలకు పైగా పోలీసులను మొహరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించారు.
జూబ్లిహిల్స్ లో మొత్తం 4 లక్షలకు మందికిపైగా ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది ఉన్నారు. 4 లక్షల మందిలో కేవలం ముస్లిం ఓటర్లు లక్ష వరకు ఉంటారు. వీళ్ళు ఎటువైపు ఓటేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్ లు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. ముస్లిం ఓట్లు జూబ్లిహిల్స్ రిజల్ట్ ను ప్రభావితం చేయనున్నాయి.
ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు… ఈయన పలుమార్లు జూబ్లిహిల్స్ అసెంబ్లీకి పోటీచేశారు. బిఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను పోటీలో నిలిచింది. ఇక బిజెపి లంకల దీపక్ రెడ్డిని జూబ్లిహిల్స్ ఉపఎన్నిక పోటీలో నిలిపింది. ఇక ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 58 మంది జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ పోలింగ్, నవంబర్ 14న పలితాలు వెలువడనున్నాయి.