జర్నలిస్టులకు హెల్త్ కార్డులిచ్చిన ఫాయిదా ఏముంది ?

Published : Aug 05, 2017, 01:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
జర్నలిస్టులకు హెల్త్ కార్డులిచ్చిన ఫాయిదా ఏముంది ?

సారాంశం

వెల్నెస్ సెంటర్ లో సౌకర్యాలే లేవు టెస్ట్ ల కోసం నిమ్స్, ఎం.ఎన్.జె లకు రిఫర్ నెల, రెండు నెలల పాటు క్యూ ఫాలో కావాలి.


వైద్యానికి, ఆరోగ్యానికి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఒక్కసారి ఉద్యోగులూ, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ నూ పట్టించుకోవాలి. సిబ్బంది కొరత ఎలాగూ ఇబ్బంది పెడుతోంది. దీనికితోడు అవసరమైన మెషినరీ కూడా అందుబాటులో లేదు. సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి పరీక్షలకు నిమ్స్, ఎమ్.ఎన్.జె. లాంటి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. 

ఆ ఆసుపత్రులలో భిన్నమైన పరిస్థితి. నిరు పేదలు, ఎమర్జెన్సీ పరిస్థితులతో ఈ ఆసుపత్రులు నిత్యం రద్దీగానే ఉంటాయి. రిఫరెన్స్ లెటర్ పట్టుకొని వచ్చిన ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీంలోని వారిని చక్కగా రెండు నెలలపాటు 'క్యూ' లో పడేస్తున్నారు. అంతకాలం వేచి ఉంటే జబ్బు కాస్తా ముదిరిపోతుందేమో అని అధికారులను ప్రశ్నిస్తే ఇక్కడికొచ్చే రోగుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది గనుక మేము వారినే చూస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో వారిచ్చిన నెలా రెండు నెలల గడువు వేచి చూడాల్సి వస్తోంది. 

ఈలోపు తాత్కాలిక ఉపశమనం కోసం వెల్నెస్ వైద్యులు ఇచ్చిన మందులు అయిపోతాయి. అంతేకాదు... వైద్యుల దగ్గరికెళ్ళినా ఏమైందో తెలియని అయోమయ పరిస్థితిలో చచ్చినట్టు రెండు నెలలు గడపాల్సి వస్తోంది. ఈహెచ్ఎస్.లో ఉన్న రోగుల సంఖ్య ఇంకా పెరిగితే ఈ క్యూ గడువు మరింతగా పెరుగుతుందన్మాట. ఇంతటి నిర్లక్ష్య వైద్యం అందుకుంటున్న లబ్ధిదారులు ప్రైవేటులో వేల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితిలో లేరు. అలాగని నిరుపేదలకు అందే వైద్యానికి అడ్డుపడనూలేక న్యూనతతో కుమిలిపోతున్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈహెచ్ఎస్ వారికి అవసరమైన పరీక్షా సామాగ్రిని అందుబాటులో ఉంచితే మంచిది. లేకపోతే...నోట్లో ముద్ద పెట్టి నెత్తి మీద మొట్టిన చందం అయిపోతుంది పరిస్థితి.

 

- రచయిత నస్రీన్ ఖాన్, జర్నలిస్టు

PREV
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?