రేపు జర్నలిస్ట్ గుర్రంకొండ శ్రీకాంత్ సంస్మరణ సభ

First Published Feb 10, 2018, 5:04 PM IST
Highlights
  • జనవరి 12న తుది శ్వాస విడిచిన జర్నలిస్టు గురువు శ్రీకాంత్
  • 50 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం జర్నలిజంలో సర్వీస్

జర్నలిజంలో ఒక వెలుగు వెలిగిన గుర్రంకొండ శ్రీకాంత్ (79) సంస్మరణ సభ ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరగనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ తో పాటు శ్రీకాంత్ శిష్య బృందం సంయుక్తంగా ఈ సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. గుర్రంకొండ శ్రీకాంత్ జనవరి 12వ తేదీన తుది శ్వాస విడిచారు.

ఐదు దశాబ్దాల పాటు జర్నలిజం సమాజానికి సేవలందించిన ఘన చరిత్ర కలిగిన మహోన్నత వ్యక్తి శ్రీకాంత్. ఆయన ఎంతో మంది యువ జర్నలిస్టులను ఈ సమాజానికి అందించారు. వార్త ఇనిస్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం (విఐజె) ప్రిన్సిపాల్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ సమయంలో సుమారు 400 మందికి పైగా జర్నలిస్టులను తీర్చిద్దారు. నెల్లూరు జిల్లా సీతారాంపురంలో పుట్టిన గుర్రంకొండ శ్రీకాంత్ విద్యార్థిగా ఉన్నప్పుడే విజయవాడ నుంచి (ఆంధ్ర రాష్ట్రం) వెలువడే ‘యువజన’ పత్రికకు పలు వ్యాసాలు రాశారు. పాత్రికేయ జీవితానికి పడిన ఆ పునాది ఆ తర్వాత ప్రగతిశీల భావజాలం కారణంగా విశాలాంధ్ర పత్రికలో పాత్రికేయునిగా పనిచేయడానికి దోహదపడింది. కొంతకాలం అక్కడే పనిచేసిన శ్రీకాంత్ ఆ తర్వాత సోవియట్ విప్లవం స్ఫూర్తితో అప్పటి మద్రాసు నగరం నుంచి వెలువడే ‘సోవియట్ భూమి’ పత్రికలో చేరారు. 1970వ దశకంలో అది మూతపడేంత వరకు ఆ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.

ఆ తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనలో శ్రీకాంత్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ఆహ్వానం మేరకు మద్రాసు నగరాన్ని విడిచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ అనేక కోణాల్లో శ్రీకాంత్‌తో లోతుగా చర్చించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు రాజకీయ ప్రసంగాలను తయారుచేసే కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్‌కు చివరి ప్రసంగాన్ని రూపొందించింది కూడా శ్రీకాంతే. ఎన్టీఆర్ మరణించేంత వరకూ గండిపేటలోని కుటీరంలోనే కుటుంబంతో కలిసి ఉండేవారు. ఆ తర్వాత వార్త దినపత్రిక ప్రారంభమవుతున్న సందర్భంగా యాజమాన్యం విజ్ఞప్తి మేరకు జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు.

శ్రీకాంత్ సంస్మరణ సభకు వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ వర్కింగ్ జర్నలిస్టు మిత్రులు, ప్రెస్ క్లబ్ సభ్యులంతా హాజరు కావాలని శ్రీకాంత్ శిష్య బృందం సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ కింది ఫోన్ నెంబర్లకు సంప్రందించాలని తెలిపారు.

కాట్రగడ్డ అజిత, ఎడిటర్, 99 టివి. హైదరాబాద్. 9490099204

అల్లి నాగరాజు, రిపోర్టర్, ఏషియానెట్, హైదరాబాద్. 9949983480

వేదాంతాచార్యులు, రిపోర్టర్, వార్త హైదరాబాద్. 9866963850

అగస్టీన్ సిరికొండ, ఎడిటర్ వూదయం పత్రిక. 9247698676

బి. శ్రీనివాసరావు రిపోర్టర్, వార్త పత్రిక (అమరావతి) 9912341218

click me!