పార్టీలో భిన్నాభ్రియాలు ఉన్నప్పటికీ.. అంతా కలిసే ఉన్నాం: దిగ్విజయ్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Dec 22, 2022, 1:01 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో పార్టీ అంతర్గత విషయాలు చర్చించానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్న సీనియర్లు, జూనియర్లు అంతా కలిసే పనిచేస్తున్నారని చెప్పారు
 

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో పార్టీ అంతర్గత విషయాలు చర్చించానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  తెలిపారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్న సీనియర్లు, జూనియర్లు అంతా కలిసే పనిచేస్తున్నారని చెప్పారు. తాము విడిపోయామని భావించడానికి వీల్లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు. 

దిగ్విజయ్ సింగ్‌ పార్టీని ఎలా బలోపేతం చేయాలనేదానిపై చర్చించేందుకు ఇక్కడకు వచ్చారని చెప్పారు. కాంగ్రస్ పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారని చెప్పారు. తాను కూడా తన సలహాలు, సూచనలు ఇచ్చానని తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్‌ గాంధీ భవన్‌లో ఆయన పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. నేతలతో చర్చల అనంతరం దిగ్విజయ్ సింగ్‌ మీడియా ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడతారని భావించినప్పటికీ.. అది వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.

ఇక, ఈరోజు ఉదయం తాజ్ కృష్ణ హోటల్‌లో దిగ్విజయ్ సింగ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కొంత సంయమనం పాటించారు. దిగ్విజయ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా చెప్పారు. దిగ్విజయ్ చర్చల తర్వాత టీ కాంగ్రెస్‌‌లో పరిస్థితులు మారతాయని భావిస్తున్నట్టుగా తెలిపారు. పార్టీలో నాయకులంతా మాట్లాడుకునే పరిస్థితులు లేదన్నారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని తెలిపారు. 

click me!