జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్

By Arun Kumar P  |  First Published Apr 16, 2021, 4:52 PM IST

సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. 


హైదరాబాద్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ గా తేలినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని జనసేన పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

''ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో పవన్ కల్యాణ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది'' అని హరిప్రసాద్ వెల్లడించారు.

Latest Videos

''ఖమ్మం జిల్లాకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ కి చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు'' అని అన్నారు. 

read more  వ్యక్తిగత సిబ్బందికి కరోనా: క్వారంటైన్‌లోకి పవన్ కళ్యాణ్

''పవన్ కల్యాణ్  ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖతో పాటు రామ్ చరణ్, ఉపాసన తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే  చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు'' అని తెలిపారు.

''అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ని పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డిలు పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు'' అని హరిప్రసాద్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

 

click me!