కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డారు, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహరో కూడా పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం అమిత్ షా నివాసం నుంచి పవన్ వెళ్లిపోయారు.
కాగా.. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేనాని భావించారు. 32 చోట్ల తాము బరిలోకి దిగుతామని కూడా పవన్ పేర్కొన్నారు. ఇటీవల ఆయనను కలిసిన తెలంగాణ ప్రాంత జనసేన నేతలు సైతం.. పోటీ విషయంలో వెనక్కి తగ్గొద్దని తేల్చిచెప్పారు. ఆ వెంటనే కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు పవన్‌తో భేటీ అయి.. ఎన్నికల్లో తమకు మద్ధతు ఇవ్వాలని కోరారు. పొత్తులో భాగంగా 20 స్థానాలు జనసేనకు కేటాయించాలని బీజేపీ ప్రతిపాదించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే జనసేన పోటీ చేయకుండా.. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కమలనాథులు భావించారు. కానీ జనసేన నేతలు మాత్రం పోటీ చేయాల్సిందేనని పవన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బలంగా వున్న చోట్ల బరిలోకి దిగాలని జనసేన భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌కు అమిత్ షా నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన ఆగమేఘాల మీద హస్తినలో వాలిపోయారు. మరి జనసేనకు సీట్లు, పొత్తుపై అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.