తన ప్రాణమున్నంత వరకు తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతానని ఆయన వెల్లడించారు. నాయకత్వం విషయంలోనే రేవంత్ రెడ్డితో విభేదించానని.. పార్టీ కోసం, ప్రజల కోసం ఒక మెట్టు దిగుతానని రేవంత్ సైతం అన్నారని కోమటిరెడ్డి గుర్తుచేశారు.
తన సతీమణి రాజకీయాల్లోకి వస్తారనడం అవాస్తవమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . తన ప్రాణమున్నంత వరకు తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ అవకాశం ఇస్తే.. కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఎల్బీ నగర్‌లో పోటీ చేయమని అక్కడి నేతలు అడిగారని .. తాను మాత్రం మునుగోడు నుంచే పోటీ చేస్తానని ఆయన తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో తాను నైతికంగా గెలిచానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారానని చెప్పిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
కేంద్రంలో ఇప్పటికీ బీజేపీ అధికారంలో వుందని, మరి తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నది ఎందుకని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. ఉపఎన్నిక వస్తేనే.. మునుగోడుకు మంచి జరుగుతుందని అప్పుడు భావించానని ఆయన తెలిపారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్, ఇవాళ కుమారుడిని సీఎం చేయాలని తాపత్రాయపడుతున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని.. సీఎం ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ గెలవాలని రాజగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమ కారులు, నిరుద్యోగులకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అయ్యేందుకు ఇది రాజరికం కాదని.. ప్రభుత్వ అవినీతిలో మాత్రమే ఇవాళ తెలంగాణ నెంబర్‌వన్‌గా వుందన్నారు. తెలంగాన సమాజం మరోసారి ఆత్మగౌరవం కోసం పోరాడుతోందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులే ఇవాళ కీలక పదవుల్లో వున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వారు ఇవాళ రోడ్ల మీద వున్నారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన సొంత పార్టీ సీఎంనే ఎదిరించామని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్న కేసీఆర్‌తో పోరాడామని కోమటిరెడ్డి తెలిపారు.
ALso Read : తుదిశ్వాస వరకు బీజేపీలోనే వుండాలనుకున్నా .. కానీ , కవిత అరెస్ట్ కాకపోవడంతో : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు
ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతానని ఆయన వెల్లడించారు. తనకు ఎల్బీ నగర్ లేదా మునుగోడు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కానీ ప్రజాభీష్టం మేరకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో వుంటేనే మీరు గెలుస్తారని ప్రజలు తనతో చెప్పారని.. అవినీతి కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌లో చేరాలని ప్రజలు సూచించారని కోమటిరెడ్డి తెలిపారు. తన జీవితంలోనే పెద్ద నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించారు. నాయకత్వం విషయంలోనే రేవంత్ రెడ్డితో విభేదించానని.. పార్టీ కోసం, ప్రజల కోసం ఒక మెట్టు దిగుతానని రేవంత్ సైతం అన్నారని కోమటిరెడ్డి గుర్తుచేశారు.
రాష్ట్రంలో నియంత పాలన అంతం కావాలన్నదే తన లక్ష్యమని.. నియంత పాలనపై పోరాటానికి కలిసిరావాలని ప్రజలు కోరారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ బాగు కోసం మలిదశ ఉద్యమంలో తాను కూడా భాగం కావాలని భావించానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే కేసీఆర్ దుర్మార్గ పాలన అంతం అవుతుందని ప్రజలు అంటున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరూ బీఆర్ఎస్‌కు మళ్లీ ఓటు వేసే పరిస్ధితి లేదని.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే నినాదం ప్రజల్లో బలంగా వుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో వున్నవారు ప్రజల నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని ఆయన సూచించారు.